Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బషీర్‌బాగ్‌ను మించి విద్యుత్ పోరాటం...
- తుపాకీ తూటాలకు నేనే ముందుంటా: రేవంత్
- ఏ కుటుంబంలోనూ ఉగాది సంతోషం లేదు..
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రత్యక్ష మిలిటెంట్ తరహా పోరాటాలకు సిద్ధం కావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... బషీర్‌బాగ్‌ను మించి వీరోచిత పోరాటం విద్యుత్‌సౌధ ముందు జరగాలనీ, ఇందులో అందరూ పాల్గొనాలని సూచించారు. కమ్యూనిస్టు సోదరులు కూడా ఇందుకు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. లాఠీ దెబ్బలకు, తుపాకీ తూటాలకు తానే ముందుంటాననీ, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా కాంగ్రెస్‌పార్టీ నిర్దిష్ట కార్యాచరణ తీసుకున్నట్టు ఆయన వివరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ఏ ఒక్క కుటుంబంలోనూ ఉగాది సంతోషం లేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రో ధరలతోపాటు అన్ని రకాల నిత్యావసరాల వస్తువుల రేట్లనూ అమాంతం పెంచేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో జీవిస్తున్న ప్రతీ ఒక్కరినీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. యూపీఏ హయాంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగితే వాటిని కేంద్రమే భరించింది తప్ప...ప్రజలపై భారాలు మోపలేదన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయా ధరలు తగ్గిన ప్రస్తుత తరుణంలో మోడీ సర్కారు గత ఎనిమిదేండ్ల కాలంలో పన్నుల రూపంలో రూ.26 లక్షల కోట్లు దోచుకుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల మేర భారాలు మోపిందని వివరించారు. టీఆర్ఎస్ సర్కారు కేంద్రానికి రాసిన లేఖ ప్రకారం... పార్బాయిల్డ్ రైస్‌ను కొనబోమంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో చెప్పారని గుర్తు చేశారు. ఒకవేళ సీఎం కేసీఆర్ ఆ లేఖను రాసి ఉండకపోతే గోయల్‌ను బయటకు గుంజకొచ్చేవాళ్లమని హెచ్చరించారు. అలా లేఖ రాసి, సంతకం పెట్టినందుకు కేసీఆర్‌ను ఉరేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎం... ప్రగతి భవన్ బయటకొచ్చి ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మార్చి మొదటివారంలోపే రాష్ట్ర ప్రభుత్వం అన్నీ సిద్ధం చేసుకోవాల్సి ఉందని అన్నారు. ఇప్పటి వరకూ అందుకు సంబంధించిన అంచనాలను సర్కారు వేసుకోకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పుడు ప్రక్రియ మొదలుపెడితే నెల రోజులు పడుతుందని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోళ్లతోపాటు ఇతర ప్రజా సమస్యలన్నింటిపై ఆయన కాంగ్రెస్ చేపట్టబోయే ఆందోళనలు, నిరసనలకు సంబంధించిన కార్యాచరణను ప్రకటించారు. విద్యుత్‌్ ఛార్జీలకు సంబంధించి గతంలో జరిగిన బషీర్‌బాగ్ ఉద్యమం ఇంకా మనందరి ముందే ఉందని గుర్తు చేశారు. ఈ విషయాన్ని గుర్తెరగాలని ఆయన కమ్యూనిస్టులకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ చేపట్టబోయే ఆందోళనల్లో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారని వివరించారు.
కార్యాచరణ...
1) ఆదివారం అన్ని జిల్లా కేంద్రాల్లో పత్రికా సమావేశాలు
2) సోమవారం మండల కేంద్రాల్లో నిరసనలు
3) ఈనెల ఆరున జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసనలు
4) ఏడున విద్యుత్ సౌధ, పౌర సరఫరాలశాఖ కమిషనరేట్ ముట్టడి