Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్టుల కోసం మానసిక రోగులకూ తప్పని తిప్పలు
- ఎర్రగడ్డ ప్రభుత్వాస్పత్రిలో దుస్థితి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అది రాష్ట్రంలో అతి పెద్ద ప్రభుత్వ మానసిక చికిత్సాలయం. జిల్లాల్లో అవసరమైనన్ని సౌకర్యాలు లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి నిత్యం రోగులు అక్కడికి వస్తుంటారు. ఆ రోగులను చేర్చుకునే క్రమంలో సరైన టెస్టులు లేకపోవడంతో వారిని ఇతర ఆస్పత్రుల చుట్టూ వైద్యులు తిప్పుతున్నారు. ఇంట్లో ఒక మానసిక రోగి ఉంటేనే ఆ రోగిని చూసుకునేందుకు కుటుంబం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అక్కడికి నిత్యం తోడుగా ఉంటూ మరో వ్యక్తి సపర్యలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయా కుటుంబాలు మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది చితికిపోయారు. కరోనా అనంతరం ప్రజల్లో మానసిక ఇబ్బందులు పెరిగిపోయాయని పలు అధ్యయనాల్లో తేలింది. దీనికి తోడు అంతకు ముందు నుంచి ఉన్న రోగులు అదనం. దీంతో హైదరాబాద్లోని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నది.
అయితే రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ జిల్లాల్లో రోగులకు క్లోజ్డ్ రూములు లేకపోవడంతో హైదరాబాద్ కే రెఫర్ చేస్తున్నారు. దీంతో ఆ రోగితో పాటు మరొకరు సహాయకులుగా రావాల్సిన పరిస్థితి. సుదూరాల నుంచి వ్యయ ప్రయాసాలకోర్చి ఆస్పత్రికి వచ్చినప్పటికీ వెంటనే పరీక్షలు చేసి అవసరమైతే చేర్చుకునే పరిస్థితి కనిపించడం లేదని రోగుల సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానసిక రోగంతో పాటు షుగర్ తదితర వ్యాధులుంటే వారిని ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి మిగతా టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు. జిల్లా నుంచి రోగిని వెంట పెట్టుకుని రావడమే తీవ్ర ఇబ్బందిగా మారిన సహాయకులకు తిరిగి వారిని ఇతర ఆస్పత్రులకు టెస్టుల కోసం తీసుకువెళ్లాల్సి రావడం మరింత కష్టంగా మారింది. దీనికి తోడు ఆయా టెస్టుల రిపోర్టులు వచ్చేంత వరకు మానసిక వైద్యశాలలో ఇన్ పేషెంట్ గా చేర్చుకోబమని తేల్చిచెబుతుండటం తో అప్పటి వరకు ఎక్కడ ఉండాలో తెలియడం లేదని సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానసిక రోగంతో పాటు ఇతర రోగాలున్న వారికి అటు, ఇటు తిప్పే పరిస్థితి లేకుండా జనరల్ ఫిజిషియన్ ను అందుబాటులో ఉంచితే బాగుంటుందని వారు కోరుతున్నారు.
సౌకర్యం ఉంది.... ఒపీనియన్ కోసం
పంపిస్తున్నాం... డాక్టర్ ఉమాశంకర్
తమ వద్దకు వచ్చే మానసిక రోగులకు ఇతర వ్యాధుల నిర్ధారణ చేసేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఉమాశంకర్ తెలిపారు. అయితే షుగర్ తదితర వ్యాధులు తీవ్రంగా ఉన్నట్టు పరీక్షల్లో తేలితే సంబంధిత స్పెష లిస్టుల సలహా కోసం ఇతర ఆస్పత్రులకు పంపిస్తుంటామని వివరిం చారు. తమ వినతి మేరకు డీఎంఇ గతంలో ఇక్కడ జనరల్ ఫిజీషియన్ ను కేటాయించారని తెలిపారు. కరోనా సమయంలో వారి సేవలను కోసం తిరిగి వేరే ఆస్పత్రిలో వినియోగించుకుంటున్నారని చెప్పారు.