Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగున మండలకేంద్రాల్లో నిరసన దీక్షలు11న ఢిల్లీలో నిరసన
- 6న జాతీయ రహదారులపై రాస్తారోకోలు
- 7న 32 జిల్లా కేంద్రాల్లో వేలాది మందితో ఆందోళనలు
- 8న ప్రతి ఇంటిపైనా నల్ల జెండాల ఎగురవేత..: కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై ఐదంచెల పోరాటం చేస్తాం.గ్రామస్థాయి నుంచి ఢిల్లీ దాకా నిరసన కార్యక్రమాలతో ముందుకెళ్తాం.ఈ నెల నాలుగో తేదీన అన్ని మండల కేంద్రా ల్లోనూ నిరసన దీక్షలు చేపడతాం. ఆరో తేదీన ముంబయి, నాగ్‌పూర్, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులపై రాస్తారోకోలు చేస్తాం. ఏడో తేదీన హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లా కేంద్రాల్లోనూ వేలాదిమంది రైతులు,మా పార్టీ కార్యకర్తలతో నిరసనలు చేపడతాం.ఎనిమిదో తేదీన రాష్ట్రంలోని12,769 గ్రామ పంచాయతీల్లో ప్రతి రైతు తన ఇంటి మీద నల్లజెండా ఎగురవేయాలి.ర్యాలీలు నిర్వహించాలి.కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ను తగులబెట్టి నిరసన తెలపాలి.11న ఢిల్లీలో తెరాస మంత్రులు, ప్రజాప్రతి నిధులు నిరసన తెలుపుతారు. పార్లమెంట్లో తెరాస ఎంపీలు గళమెత్తుతా రు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలి'' అని టీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలుపై ఢిల్లీలోని బీజేపీ నాయకులు ఒక విధంగా...గల్లీలోని నాయకులు మరోలా మాట్లాడుతు న్నారని విమర్శించారు. లక్షలాది మంది రైతుల శ్రేయస్సు దృష్ట్యా బాయిల్రైస్, రారైస్ నిబంధనలు పెట్టొద్దని వేడుకున్నా..పెద్దమనస్సు చేసుకుని కొనాలని విజ్ఞప్తి చేసినా మోడీ సర్కారు మొండిగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఆహార భద్రత చట్టం ప్రకారం నడుచుకోవాలని విన్నవించినా చెవికెక్కడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాదనీ, కార్పొరేట్ల కొమ్ముకాసే సర్కారని స్పష్టమైందని చెప్పారు. కేంద్రం కొనబోమని చెప్పిన తర్వాతనే మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వ్యవసాయ మంత్రి ప్రకటనను తప్పుబడుతూ సీఎం, మంత్రుల మాటలు పట్టించుకోవద్దనీ, రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేయించే బాధ్యత తమదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ హామీనిచ్చిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. యాసంగిలో ధాన్యం కొంటారా? కొనరా? ఢిల్లీ బీజేపీ నేతలు మాట్లాడేది కరెక్టా? ఇక్కడ మాట్లాడుతున్న సిల్లీ నేతలది కరెక్టా? అని నిలదీశారు. పంజాబ్‌లో కొనుగోలు చేస్తరు..ఇక్కడ ఎందుకు కొనరని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో దేశమంతటా ఒకే విధానం తీసుకురావని డిమాండ్ చేశారు. రైతులు నష్టపోవద్దనే నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో, 18న ఇందిరాపార్కు వద్ద ధర్నాలు చేశామన్నారు.