Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీడని ధాన్యం కొనుగోళ్ల సమస్య
- నువ్వంటే.. నువ్వంటూ పాలకుల విమర్శలు
- మద్దతు ధరకు దిక్కులేదు
- దళారుల బారిన పడుతున్న రైతులు
- సన్నాలకు ధర తగ్గించాలని మిల్లర్లపై నేతల ఒత్తిడి!
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ధాన్యం కొనుగోళ్లపై చిక్కుముడి వీడటం లేదు. పంట కల్లాలకు చేరుతున్నా సమస్యను పరిష్కరించకుండా నీవంటే.. నీవంటూ కేంద్ర రాష్ట్ర పాలకులు విమర్శలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మధ్యలో రైతుల విలవిల్లాడుతున్నాడు. తాము రైతు పక్షపాతమంటే.. తామే అంటూ గప్పాలు చెబుతూ.. ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యలో పంట చేతికందే సమయానికి దళారులు ఊర్లపై పడి తక్కువ ధరకు తన్నుకుపోతున్నారు. మరోవైపు సాఫీ కొనుగోళ్లు సాగితే.. కేంద్రంపై రైతుల్లో వ్యతిరేకత.. తమకు సానుభూతి రాదన్న భయంతో.. సన్న రకం ధాన్యం కొంటున్న మిల్లర్లపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చి ధర తగ్గించారన్న విమర్శలు ఉన్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరి సుమారు 12లక్షల ఎకరాల వరకు సాగైంది. సుమారు 25లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి అవుతుందని అధికారుల అంచనా. అందులో నల్లగొండ జిల్లాలో 4,43978 ఎకరాల్లో పంట సాగు కాగా.. 11,13,603 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. సూర్యాపేటలో 4,61,532 ఎకరాలు సాగు చేయగా.. సుమారు 11,54,254 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని అంచనా వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,65,761 ఎకరాల్లో వరి సాగైంది. సుమారు 3,14,947 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు భావించారు.
గింజను అమ్ముకోవడమే కష్టం..
గతంలో ప్రభుత్వం పంటను పూర్తిగా కొనుగోలు చేసింది. దాని కోసం ఏ గ్రేడు రకం 1960, బి గ్రేడు రకం 1940 మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఐకెపి, మార్కెటింగ్ శాఖ, పీఏసీఎస్ సంస్థల ద్వారా దాదాపు మూడు గ్రామాలకు ఒకటి చొప్పున సుమారు 300కు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యం రవాణాకు ఆర్థికంగా భారం తక్కువగా ఉండేది. కానీ ఈ సీజన్ నుంచి ధాన్యం కొనుగోలు చేసే ప్రసక్తే లేదని మొదట్లో కేంద్రం ప్రకటించింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వరి పండిస్తే ఉరే అని ప్రకటించింది. కేంద్రం కొంటలేనందున ఇకపై ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మేరకు కేంద్రానికి కూడా రాష్ట్రం నుంచి లేఖ రాసిచ్చిందని కేంద్ర పాలకులు చెబుతున్నారు. కానీ రాష్ట్ర బీజేపీ నేతలేమో వరి పండిస్తే తాము కొనుగోలు చేసేలా చూస్తామని రైతులకు బూటకపు హామీ ఇచ్చారు. కానీ ఇపుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మీరే కొనాలంటే.. మీరే కొనాలని విమర్శలు చేసుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో ఆందోళనకు గురవుతున్న రైతులు దళారీల బారిన పడుతున్నారు.
వ్యాపారుల చేతుల్లోకి పంట
ఎపుడైనా ఏప్రిల్ మొదటి వారం నుంచే వరి కోతలు ప్రారంభమై ధాన్యం విక్రయాలు జరుగుతుంటాయి. ఈసారి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టే ఆలోచన లేనందున రైతులే నేరుగా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన దళారీలు అందిన కాడికి దండుకుంటున్నారు. యాదాద్రి జిల్లా ఆలేరులో ఈ మధ్యనే ఓ రైతు దొడ్డురకం ధాన్యం రూ.1400 అమ్ముకున్నాడు. ఉగాది పండుగ రోజు సన్నరకం ధాన్యాన్ని మిర్యాలగూడ మిల్లుల వద్ద అమ్మడానికి వెళితే రైతులను వెళ్లగొట్టారు. చేసేది లేక రైతు ఓ దళారిని సంప్రదిస్తే రూ.1800కు పంటను కొనుగోలు చేశారు. అయితే పంట కోతల మొదట్లోనే రైతులకు ఇలా నష్టం జరిగితే.. పూర్తి కోతలు అయ్యే సమయానికి ధాన్యం నిల్వలు పెరుగుతాయి. అపుడు పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉంది. క్వింటాలుకు సుమారు రూ.400 నుంచి 500 వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. చివరకు పెట్టుబడి కూడా రైతు మీద పడే అవకాశం ఉంది.
ధర తగ్గించాలని మిల్లర్లపై ఒత్తిడి
నల్లగొండ జిల్లాలో పండించిన సన్నరకం ధాన్యం మొత్తం మిర్యాలగూడ మిల్లర్లు కొనుగోలు చేస్తారు. ఈ మధ్య జరిగిన నల్లగొండ జిల్లా పరిషత్ సమావేశంలో కూడా స్థానిక ఎమ్మెల్యే భాస్కర్‌రావు సన్నరకం ధాన్యం కొనుగోలు చేయించే బాధ్యత తనదేనని చెప్పారు. మూడ్రోజుల కిందటి వరకు సన్నరకం ధాన్యం క్వింటాలుకు రూ.2100 నుంచి 2200 వరకు మిల్లర్లు కొనుగోలు చేశారు. రైతులు కూడా పరవాలేదని ఏ ఇబ్బందీ లేకుండా అమ్ముకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మిల్లర్లు ధరలను తగ్గించి ధాన్యం కొనుగోలు చేయాలని అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిడి వచ్చినట్టు తెలిసింది. అందుకే వారంతా ఈ మధ్య సమావేశమై సిండికేట్‌గా మారి క్వింటాల్‌కు రూ.1900లోపే ధర పెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. రైతులంతా కేంద్రంపై దుమ్మెత్తి పోసేలా ఉండాలని, ఏ లొల్లి లేకుండా ధాన్యం అమ్ముడు పోతే తమకే ఇబ్బంది కలుగుతుందని, వారి నుంచి సానుభూతి పొందే అవకాశం ఉండదనే భావనతో అధికార పార్టీ నుంచి ఒత్తిడి వచ్చినట్టు సమాచారం.
రెండ్రోజుల కిందట జాయింట్ కలెక్టర్ మిర్యాలగూడకు వెళ్లి పరిశీలించారు. సన్న రకం ధాన్యానికి మిల్లర్లు రూ.2వేల కంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ధర తక్కువ చేయకూడదని గట్టిగా హెచ్చరించినట్టు తెలిసింది. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల రాజకీయ పంచాయితీలో అన్నదాతలు నలిగిపోతున్నారు.
నాలుగెకరాలు సాగు చేసిన వైద్యపు సత్యనారాయణ- తిప్పర్తి మండలం
నాలుగెకరాల్లో వరి సాగు చేసిన. పంటను ఎక్కడ అమ్ముకోవాలే. ప్రభుత్వం చేతులెత్తేస్తే పాలకులెందుకు.. పంటను కొనుగోలు చేయకపోతే సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలి. అప్పుల ఊబిలో కూరుకుపోయి చనిపోతే భీమా ఇస్తారా.. ఏం న్యాయం ఇది. మాకు ఏ పథకం వద్దు.. పండించిన పంటను కొనండి.
రెండోవారంలో కేంద్రాలు ప్రారంభించాలి
బండా శ్రీశైలం- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసి తప్పించుకోకుండా రెండో వారంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి. ఇప్పటికే వరి కోతలు మొదలయ్యాయి. దళారులు రంగప్రవేశం చేసి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. దానివల్ల కనీసం పెట్టుబడి కూడా రైతులకు దక్కే అవకాశం లేకుండా పోతుంది.
రూ.1400కే అమ్ముకున్నా..
దాదాపు 40క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. మద్యవర్తులకు ధాన్యం అమ్ముకున్నా. రూ.1400కే క్వింటా ధాన్యం అమ్మిన. ప్రభుత్వ కేంద్రాలుంటే క్వింటాల్‌కు రూ.1960 మద్దతు ధర వచ్చేది. ఇప్పుడు క్వింటాల్‌కు రూ.560 చొప్పున నష్టం జరిగింది. కనీసం నా శ్రమకు కూలి కూడా గిట్టుబాటు కాలేదు.
- బుగ్గ ఎర్రయ్య, శర్బనపురం, ఆలేరు మండలం