Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధులున్నా... సరఫరా లేదు
- సిబ్బంది కొరతతో టీశాక్స్‌లో పనుల జాప్యం
- జేడీ పోస్టుల నియామకంలో సర్కారు నిర్లక్ష్యం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హెచ్ఐవీ రోగులకు మందుల కష్టాలు మొదలయ్యాయి. నాకో నుంచి నిధులకు కొరత లేకపోయినా...మందుల సరఫరాలో మాత్రం అంత రాయం చోటు చేసుకున్నది. సరిపడిన పర్యవేక్షణాది óకారులు లేకపోవడం, ఏఆర్టీ సెంటర్ నుంచి వచ్చే ప్రతిపాదనలను వెంటనే క్లియర్ చేసేలా తగినంత మంది అధికారులు, సిబ్బందిని నియమించకపోవ డం వల్ల రోగులకు తిప్పలు తప్పడం లేదు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ విఫలమవుతున్నది. ధీర్ఘకాలంగా అధికారుల పోస్టులు పెండింగ్‌లో ఉండటం కూడా నియంత్రణ కార్యక్రమాలతో పాటు రోగులకు అందించే సేవలపై పడుతున్నది. పోస్టుల భర్తీ పట్ల సర్కారు సరైన శ్రద్ధ కనబరచకపోవడంతో క్రమక్రమంగా సొసైటీ నామమాత్రంగా మారిపోతు న్నది.ఇప్పటికే పోస్టుల భర్తీకి డిప్యూటేషన్‌పై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నుంచి అధికారులను పంపించాలని టీశాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సర్కారుకు లేఖ రాసి నెలలు గడుస్తున్నా దానిపై నిర్ణయం తీసుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణమనే వాదన బలంగా వినపడుతున్నది. రాష్ట్రంలో 1,83,000 మంది పాజిటివ్ లివింగ్ హెచ్ఐవీ రోగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 22 ఏఆర్టీ సెంటర్ల నుంచి రోగులు క్రమం తప్పకుండా మందులను ఉచితంగా పొందే సౌకర్యం ఉంది. అయితే ఏఆర్టీ సెంటర్ల నుంచి ఏ వారానికి ఆ వారం మందుల అవసరంపై అధికారులకు సమాచారం ఇస్తుంటారు. ఆ మేరకు వెంటనే మందులను సరఫరా చేస్తుంటారు. అయితే గత రెండు నెలల క్రితం నుంచి అవసరమైన మందులు లేకపోవడంతో బయట కొనుక్కోవాల్సి వస్తున్నదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగులు దాదాపు రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ఖర్చు పెట్టుకోవాల్సి రావడంతో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి సొసైటీలో పర్యవేక్షణాధికారి లేకపోవడమే కారణమనే వాదన వినపడుతున్నది.
హెచ్ఐవీ రోగులకు సేవ చేయడంలో విఫలమవుతున్న సర్కారు సేవలకు అంతరాయంతోనే సరిపోలేదు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (నాకో) ఇస్తున్న నిధులు కూడా పూర్తి స్థాయిలో సద్వినియో గం కావడం లేదనే ఆరోపణలున్నాయి. స్వచ్ఛంద సంస్థలకు విడుదల చేసిన రూ.ఎనిమిది కోట్ల నిధులకుగాను రూ.మూడు కోట్లకు సంబంధించి లెక్కలు తేలడం లేదని సమాచారం. ఈ విషయంపై గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు తాము వాటికి ఖర్చులకు సంబంధించిన లెక్కలు సమర్పించినట్టు అధికారులకు చెప్పినట్టు తెలుస్తున్నది. అయితే దీనిపై స్పష్టత కొరవడింది. ఇలాంటి గందరగోళ పరిస్థితులకు పర్యవేక్షణ అధికారులు లేకపోవడమే కారణమని తెలుస్తున్నది. శాక్స్ ప్రక్షాళనపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
పెన్షన్‌కు కష్టమే...
హెచ్ఐవీ రోగులకు నెలకు ఇచ్చే పెన్షన్ కూడా అందరికి రాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనగామ జిల్లాకు చెందిన ఒక రోగి ధరఖాస్తు చేసుకుని నాలుగేండ్ల గడుస్తున్నా పెన్షన్ మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి వారికి ఉచిత మందులను కూడా తాత్కాలికంగా నిలిపేసినా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం కనిపిస్తున్నది.