Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- కస్టమర్లందరి పేర్ల జాబితా మీడియాలో చూపడం సరికాదు : డీసీపీ జోయల్ డేవిస్
నవతెలంగాణ -బంజారాహిల్స్
బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసి.. పబ్‌లోకి మత్తు పదార్థాలు ఎలా వచ్చాయనే దానిపై ఆరా తీస్తున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ మీడియాకు వెల్లడించారు. ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో తెల్లవారుజామున 4గంటల వరకు లిక్కర్, ఫుడ్ సరఫరా చేస్తున్నారని,వీటితో పాటు డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నట్టు సమాచారం అందిందన్నారు.తెల్లవారుజామున2గంటలకు టాస్క్‌ఫోర్స్ బృందం, బంంజారాహిల్స్ పోలీసులు రైడ్ చేసినట్టు తెలిపారు. ఆ సమయంలో పబ్‌లో మొత్తం 148మందిని గుర్తించామన్నారు. పబ్ మేనేజర్, క్యాబిన్ వద్ద 5 ప్యాకెట్లు కొకైన్ దొరికిందని, అందరినీ స్టేషన్‌కు తీసుకొచ్చి వివరాలను తీసుకున్నట్టు చెప్పారు. ఫుడింగ్ అండ్ మింక్ యజమాని అర్జున్ వీరమాచినేని, అభిషేక్ ముప్పాల, జనరల్ మేనేజర్ అనిల్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. పబ్‌లో యాప్ ద్వారా 250 మందిని ఎన్రోల్ చేసుకుని లిమిటెడ్ గ్రూప్‌గా పెట్టుకుని ఓటీపీ మాదిరి ఒక పిన్ కోడ్ జనరేట్ చేస్తున్నారని చెప్పారు. ఆ కోడ్ నమోదు చేస్తేనే పబ్లోపలికి ఎంట్రీ వస్తుందని, పబ్‌కు ఎవరైతే వస్తున్నారో వారు ముందుగా కాల్చేసి రిజిస్టర్ చేసుకోవాలని, పబ్‌కు వచ్చిన తర్వాత కోడ్ ఎంటర్ చేసి లోపలికి వెళ్లాల్సి ఉందని వివరించారు. రద్దీ తక్కువ ఉన్న సమయంలో మెంబర్షిప్లేని వారిని కూడా అనుమతిస్తున్నారనీ, గత ఆగస్టు నుంచి పబ్ మేనేజ్మెంట్ మారిందన్నారు. పట్టుబడిన కొకైన్ ఎక్కడి నుంచి తెచ్చారు? కస్టమర్స్ ఎవరెవరు వినియోగిస్తున్నారు? అనేది విషయాలు ఇంకా మేనేజర్ చెప్పలేదన్నారు. మేనేజర్ గతంలో గోవాలో ఒక పబ్ నిర్వహించి ఇక్కడకు వచ్చినట్టు తెలిపారు. కస్టమర్స్ డ్రగ్స్ వినియోగించారా? లేదా? ఎవరెవరు తీసుకున్నారు? అనేది తేలాల్సి ఉందని, మత్తు పదార్థాలు సేవించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. పబ్‌కు వచ్చిన కస్టమర్ల పేర్లు బయటపెట్టడం సమంజసం కాదని, వారు నిర్వాహకులు కాదని అన్నారు. కేవలం నిందితుల పేర్లు మాత్రమే తాము చెప్పామని, మీడియాలో కస్టమర్ల జాబితా చూపిస్తు న్నారని, ఈ విధానం సరైనది కాదని అన్నారు.