Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువత, ఆటోడ్రైవర్ల బైటాయింపు
- గుట్టపైకి వాహనాలను అనుమతించాలని డిమాండ్
- నిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలని నినాదాలు
- మంత్రి జగదీశ్‌రెడ్డి కాన్వారు అడ్డగింత
నవతెలంగాణ-యాదాద్రి
యాదగిరిగుట్ట ఆలయ ఇన్చార్జి ఈవోకు వ్యతిరేకంగా యువత, స్థానికులు ఆటోడ్రైవర్లతో కలిసి ఆదివారం మెరుపు ధర్నాకు దిగారు. గత నెల 31న కొండపైకి ప్రయివేటు వాహనాలను నిషేధిస్తూ ఈవో సర్క్యూలర్ జారీ చేసిన పాఠకులకు తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో పట్టణ యువజన జేఏసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న మైదానంలో ఆటోడ్రైవర్లు ఒక్కసారిగా రోడ్డెక్కారు. ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ తీసి ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట (తెలంగాణ చౌరస్తాలో) రోడ్డుకు అడ్డంగా బైటాయించారు. ఆలయ పునర్‌ప్రారంభం తర్వాత ఈవో ఒంటెద్దు పోకడతో విసిగెత్తిస్తున్నారని పలువురు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి పనుల్లోనూ పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రధానంగా సందర్శకులకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయాలని, కొండపైకి ఇది వరకులాగా అన్ని వాహనాలను అనుమతించాలని డిమాండ్ చేశారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా స్థిరాస్థులు కోల్పోయిన స్థానికులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని.. అలాగే షరతులు లేని దైవ దర్శనం కల్పించాలని కోరారు. ఉద్యోగ కాల పరిమితి ముగిసిన ఈవోను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి నేతృత్వంలో పట్టణ ఇన్స్పెక్టర్ జానకిరెడ్డి నిరసనకారులను శాంతింపజేసేందుకు యత్నించారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఏసీపీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా భీష్మించడంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఆందోళనలో భాగంగా నేడు ఈవో దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే, సోమవారం యాదగిరిగుట్టలో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నట్టు జేఏసీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మెన్ మేడబోయిన కాటంరాజు, కౌన్సిలర్లు ముక్కర్ల మల్లేష్, తాళ్లపల్లి నాగరాజు, దండెబోయిన అనిల్‌కుమార్, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి మంద శంకర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్, సీపీఐ మండల కార్యదర్శి బబ్బూరీ శ్రీధర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లిభరత్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బెలిదె ఆశోక్, టీపీఎస్ నాయకులు బెజగం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కాన్వారు అడ్డగింత
ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి యాదాద్రి క్షేత్రదర్శనానికి విచ్చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు మంత్రులకు వినతిపత్రం అందజేయాలని మొదటిఘాట్ రోడ్డు వద్ద వేచి ఉన్నారు. మంత్రి అల్లోల కాన్వారు ఆపకుండా వెళ్లపోగా.. మరో మంత్రి గుంటకండ్లతోపాటు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కాన్వారులను ఆందోళనాకారులు అడ్డుకొని వినతిపత్రం అందజేశారు. ఈవోతో చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను పోలీసులు లాక్కెళ్లారు.