Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారికి ప్రత్యేక అర్హతలు అక్కర్లేదు
- 'కలెనేత' ఆత్మకథ ఆవిష్కరణలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రజలే చరిత్ర నిర్మాతలు అనీ, దాన్ని సృష్టించేందుకు వారికి ప్రత్యేక అర్హతలు ఏవీ అవసరం లేదని ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు కే శ్రీనివాస్ అన్నారు. గతంలో రాజులు, చక్రవర్తులు, అధికారదర్పం, సంపద ఉన్నవారే చరిత్రకు ఎక్కేవారనీ, ఇప్పుడా సరిహద్దులన్నీ చెరిగిపోయాయని చెప్పారు. బల్ల సరస్వతి రచించిన 'కలెనేత- ఏడుతరాల తలపోత' ఆత్మకథ పుస్తకావిష్కరణ సభ ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ వాస్తవికత అన్ని చోట్లా ఒకేలా ఉండదనీ, ప్రాంతాలు, కులాలు, వర్గాలను బట్టి అది మారుతూ ఉంటుందని విశ్లేషించారు. ఆత్మకథలు ఆనాటి చారిత్రక, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ చరిత్రలను భవిష్యత్ తరాలకు అందిస్తాయని అభిప్రాయపడ్డారు. బల్లె సరస్వతి ఆత్మకథ 'కలెనేత' సమకాలీన చరిత్రలోకి పాఠకులనూ తీసుకెళ్తుందని అభినందించారు. ఉపాధ్యాయురాలి ఉద్యోగ విరమణ చేసిన రచయిత తన కాలంలో పాఠశాలల్లో డ్రాపవుట్లు, అనుభవాలను మేళవించి మరింత విశ్లేషణాత్మకంగా పుస్తకం రాస్తే భవిష్యత్ తరాలకు ఉపయుక్తంగా ఉంటుందని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపవుట్లకు మహిళలు, పురుషుల్లో వేర్వేరు కారణాలు ఉంటాయని విశ్లేషించారు. 'కలెనేత' పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖ సినీ దర్శకులు సుకుమార్ మాట్లాడుతూ సాహిత్యానికీ, తెలుగు సమాజానికి లింక్ తెగిపోయింద ని అభిప్రాయపడ్డారు. చిన్నతనంలో ప్రతి ఇంట్లోనూ వినిపించే 'చిట్టి చిలకమ్మ..అమ్మ కొట్టిందా' పాటను అప్పట్లోనే పుస్తక రచయిత బల్లె సరస్వతి రచించారని తెలిపారు. సాహిత్యానికి దినపత్రికలు స్థానాన్ని ఇవ్వడం తగ్గించేశాయనీ, దీనివల్ల భూత, భవిష్యత్, వర్తమాన కాలాల చరిత్ర తెలీకుండా పోతున్నదని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ మాట్లా డుతూ 'కలెనేత' సామాన్య మధ్యతరగతి బుద్ధి జీవుల జీవన చిత్రం అని విశ్లేషించారు. సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ రచయితతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పౌరహక్కుల సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ లక్ష్మణ్, అరుణోదయ సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు విమలక్క, ప్రముఖ రచయిత చూపు కాత్యాయనీ, సామాజిక కార్యకర్త ఎస్ లక్ష్మణాచార్య తదితరులు పాల్గొన్నారు.