Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజిల్ ధరపై ఆటోలకు తాళ్లు కట్టి నిరసన
- ఖాళీ సిలిండర్లకు మోడీ బొమ్మలు, పూలదండలు
- రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎం), ప్రజాసంఘాల నిరసన
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
పెట్రోల్, డీజిల్, ధరలు తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరల మంటపై జనాగ్రహం వెల్లువెత్తుతోంది. తక్షణం ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపారు. సిలిండర్లను ఎత్తుకుని, ఎడ్ల బండ్లతో ర్యాలీలు నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ ధరలు అందుబాటులో లేకుండా పోతున్నాయంటూ.. ఆటోలను తాళ్లతో లాగారు.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆటో లాగి గ్యాస్ బండ పెట్టుకొని నిరసన తెలిపారు. కరీంనగర్ జల్లా వ్యాప్తంగా నిరసన చేపట్టారు. జమ్మికుంట పట్టణంలో ఆటోకు తాళ్లు కట్టి లాగారు. కరీంనగర్ పట్టణంలో ప్లకార్డులతో నిరసన తెలిపి మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. కొత్తపల్లి మండల కేంద్రంలో ఆటోకు తాళ్లు కట్టి లాగి నిరసన తెలిపారు.
ఖమ్మం పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో ట్రాలీ ఆటోకి తాళ్లు కట్టి లాగుతూ.. గ్యాస్ బండను ఊరేగింపు చేశారు. భారీ ర్యాలీ నిర్వహించారు. వైరాలో కట్టల పొయ్యి పెట్టి వంట చేశారు. సత్తుపల్లిలో రాస్తారోకో చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. సిద్దారంలో మహిళలు ఖాళీ గ్యాస్ బండను పక్కనబెట్టి, కట్టెల పొయ్యి మీద వంట చేశారు. ఏన్కూర్‌లో ఆటోను తాడుతో లాగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో మోటార్ సైకిళ్లకు తాడు కట్టి నిరసన తెలిపారు. చర్లలో వంటా వార్పు చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు ఆటోలకు తాళ్లు కట్టి లాగారు. ఆర్మూర్ పట్టణంలో సిలిండర్లకు పూలమాలవేసి నిరసన తెలిపారు.
సిద్దిపేట పట్టణంలో చేపట్టిన నిరసనలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కా రాములు పాల్గొన్నారు. కరోనాతో దెబ్బతిన్న ప్రజలకు సబ్సిడీ రూపంలో సరుకులను అందించాల్సి పోయి.. నిత్యం ధరలను పెంచుతూ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడ గుడి చౌరస్తాలో నిరసన కార్యక్రమంలో సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక్షులు సాయిబాబు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య జనంపై కక్షగట్టినట్టుగా వ్యవహరిస్తోందని, ప్రతి వస్తువుపైనా ధరలు పెంచుతూ ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. ధరల భారం తగ్గాలంటే ఎదురు తిరిగి పోరాడాల్సిందేనని పిలుపునిచ్చారు. సంగారెడ్డి న్యూ బస్టాండ్ దగ్గర గ్యాస్ సిలిండర్, కట్టెల పొయ్యితో నిరసన వ్యక్తం చేశారు. పటాన్చెరు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.
సూర్యాపేట పట్టణ పరిధిలోని అంబేద్కర్‌నగర్, సుందరయ్యనగర్‌లో నిరసన తెలిపారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నల్లగొండ పట్టణంలో ఆటోలకు తాళ్లు కట్టి లాగారు. పలు చోట్ల సిలిండర్లకు పూలమాల వేసి నిరసన తెలిపారు. మిర్యాలగూడ మండలం తడకమళ్లలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో సిలిండర్లు, పొయ్యి పెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద, మధ్యతరగతి ప్రజలపై పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నూనె, కరెంట్, బస్ చార్జీల భారం వేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులపై భారాలు మోపుతూ కార్పొరేట్ వ్యవస్థల బలోపేలానికి పాటుపడుతున్నాయని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు తిరగబడి పోరాడాలని పిలుపునిచ్చారు. ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. నల్లగొండ పట్టణంలో పెద్ద బండలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి, దిష్టిబొమ్మ దహనం చేశారు. తుర్కపల్లి మండలంలోని భువనగిరి-జగదేవ్‌పూర్ రహదారిపై పొయిలకట్టెలపై వంట చేశారు. అడ్డగూడూరు మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. ఆలేరుటౌన్లో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ధరలభూతం ప్లెక్లీ ప్రదర్శించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శించారు. జన్నారం, బెల్లపల్లి మండలాల్లో ఆటోను తాడుతో లాగుతూ, ఖాళీ లిసిండర్ను భుజాన వేసుకుని మోశారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆటోకు తాడు కట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండర్లు, కట్టెల పొయ్యిలతో నిరసన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆటోను తాళ్లతో లాగారు. మహిళలు ఖాళీ గ్యాస్ బండను నెత్తి మీద పెట్టుకొని ర్యాలీ చేపట్టారు.
హైదరాబాద్ సౌత్ సిటీ ఆధ్వర్యంలో ఐఎస్ సదన్ చౌరస్తా దగ్గర సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడారు. బీజేపీ అధికారంలోకొచ్చాక రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఇవ్వకపోగా.. నిరుద్యోగం పెరిగిపోయిన తరుణంలో ప్రజలపై భారాలు మోపుతోందన్నారు. ఇప్పటికే ఉన్న భారాలు సరిపోవన్నట్టు.. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల వస్తువుల ధరలు పెంచి మరింత ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.