Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టర్ల నుంచి కూలీలకు అందని పిలుపు
- ప్రారంభంకాని ఆకు సేకరణ
- ఆందోళనలో గిరిజనులు
నవతెలంగాణ-మల్హర్రావు
గిరిజనులకు వేసవి ఉపాధి ఇంకా ప్రారంభం కాలేదు. తునికాకు సేకరణకు కల్లాల సమస్య తీరలేదు.. కల్లాలు ఇంకా సిద్ధం కాకపోవడంతో ఆకు సేకరణ మొదలవ్వలేదు. ఇప్పటికే అరాప్(కొమ్మకొట్టడం) కార్యక్రమాన్ని కాస్త ఆలస్యం చేశారు. ఆకుల సేకరణపై కాంట్రాక్టర్ల నుంచి ఇంకా పిలుపు రాకపోవడంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడుగా అటవీ గ్రామాల్లో గిరిజనులకు, గిరిజనేతరులకు అటవీ అధికారుల మధ్య పోడు సమస్య రగులుతోంది. ఇది కూడా తునికాకు సేకరణకు ఆటంకంగా మారుతున్నట్టు తెలుస్తోంది.
ఏటా ఏప్రిల్, మే నెలల్లో తునికాకు సేకరణ జరుగుతుంది. అయితే తునికాకు సంబంధించిన చౌక్ అరాప్ (కొమ్మకొట్టడం) ఆలస్యమవడం, కల్లాలు చేయడం వంటివి ఇంకా చేపట్టలేదు. దీంతో తునికాకు సేకరణపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలం కొయ్యుర్ రేంజ్ పరిధిలో 14.170 హెక్టార్లు, 35 వేల ఎకరాల అడవి ఉంది. ఇందుకు రెండు సెక్షన్లు,15 బీట్లు ఉన్నాయి. తునికాకు సేకరణకు తాడిచెర్ల, రుద్రారం, శాత్రజ్ పల్లి, పెద్దతూండ్లలో కల్లాల ఏర్పాటు చేయాలి. కానీ రెండు మాత్రమే సిద్ధమవ్వగా.. ఇంకా రెండు కాలేదు. ఈ నాలుగు కల్లాల్లో 4.600 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరణే లక్ష్యంగా ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు.
గిరిజన కూలీలకు ఉపాది కల్పించే తునికాకు టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో సేకరణకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కానీ, కల్లాలు నాలుగింటికి రెండూ సిద్ధమయ్యాయి. మరోవైపు భూపాలపల్లి జిల్లాలో పలు అటవీ గ్రామాల గిరిజనులకు, గిరిజనేతరులకు అటవీ అధికారుల మధ్య పోడు సమస్య నెలకొన్న నేపథ్యంలో ఆకు సేకరణ లక్ష్యం పూర్తి చేయడం కష్టతరంగా మారింది. 1.69 లక్షల ఎకరాల్లో అటవీ భూమి విస్తరించి ఉంది. 9 రేంజ్‌లు, 45 సెక్షన్లు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 35 యూనిట్లలో 39,400 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరణ ప్రతిపాదించారు. యూనిట్ల వారీగా ఆన్లైన్లో 5 విడతలుగా టెండర్లు పిలువగా.. మార్చి 2న గడువు ముగిసింది. జిల్లా వ్యాప్తంగా మైదాన ప్రాంతంలో ఏడు యూనిట్ల సేకరణకు గుత్తేదారులు రాకపోగా.. మిగతా 28 యూనిట్లలో 32,200 స్తాండర్డ్ బ్యాగులు 210 కల్లాల్లో తునికాకు సేకరించనున్నారు.
గిరిజనులకు ఆదాయం
తునికాకు సేకరణ వల్ల గిరిజనులకు సుమారు నెల రోజులపాటు జీవనోపాధి లభిస్తుంది. గుత్తేదారుల ఆధ్వర్యంలో రోజువారీ కూలీలకు ఉపాది లభిస్తుంది. కల్లాల్లో కట్టలను ఎండకు ఎండేలా మార్పులు చేస్తుంటారు. ఇలా ప్రతి ఒక్కొక్కరికి కొంతమేర ఆదాయం లభిస్తుంది. తునికాకు సేకరణలో ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తోంది. ఏటా జిల్లా వ్యాప్తంగా కూలీలకు రూ.3 కోట్లు, ప్రభుత్వానికి రూ.4 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది.
ఆకు సేకరణతో ఉపాధి : లక్ష్మీ
వేసవిలో తునికాకు సేకరణయే మాకు ఉపాధి. ఇప్పటికే ఆకు సేకరణ ప్రారంభం కావాలి. కానీ ఈసారి ఇంకా ప్రారంభం కాలేదు. ఆకు సేకరణతో మాకు ప్రతి వేసవికాలంలో ఎంతో కొంత ఆదాయం వస్తోంది.
కట్టకు రూ.3 చెల్లించాలి
అక్కల బాపు యాదవ్, ప్రజాసంఘాల నాయకుడు
తునికాకు సేకరణ కూలీలకు 50 ఆకుల కట్టకు రూ.3 చెల్లించాలి. అలాగే 2012 నుంచి పెండింగ్‌లో ఉన్న కూలీలకు ఇవ్వాల్సిన బోనస్ డబ్బులు మంజూరు చేయాలి.