Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెకారు ఆపరేషన్‌తో బట్టబయలు
- పబ్‌లో ప్రముఖుల పిల్లలు
- బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్
- ఏసీపీకి చార్జి మెమో జారీ
- కొత్త సీఐగా నాగేశ్వర్రావు నియామకం
- డ్రగ్స్ ఘటనపై సర్కార్ సీరియస్
- పోలీసు అధికారులతో సీపీ అత్యవసర సమావేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో/బంజారాహిల్స్
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. బంజారాహిల్స్ రోడ్డు నెం.6లోని రాడిసన్‌బ్లూ హోట్‌ల్ ఆవరణంలోని పుడింగ్మింక్ పబ్‌లో అర్ధరాత్రి 1.40 గంటలకు భారీగా యువతీ యువకులు హంగామా సృష్టించారు. అక్కడ డ్రగ్స్ వాడుతున్నట్టు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకు డెకారుపై ఆపరేషన్ చేపట్టారు. డ్రగ్స్ బాగోతం వెలుగులోకొచ్చింది. పబ్‌లో 100మందికిపైగా మద్యం సేవిస్తున్నట్టు గుర్తించారు. 5 ఫ్యాకెట్ల కొకైన్‌ను గుర్తించారు. నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన మహదారం అనిల్‌కుమార్, అభిషేక్ ఉప్పాల, అర్జున్ వీరమాచినేనిని పోలీసులు గుర్తించారు. వీరిలో అనిల్‌కుమార్, అభిషేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అర్జున్ పరారీలో ఉన్నారు. పబ్ అర్ధరాత్రి పార్టీలో 148 మంది పాల్గొన్నట్టు గుర్తించారు. పబ్ సిబ్బంది 20 మంది, 38 మంది యువతులు, 90 మంది యువకులు ఉన్నారు. అదుపులో ఉన్న వారి నుంచి అనుమానాస్పద ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పబ్‌లో దొరికిన డ్రగ్స్‌ను ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. అయితే, పబ్‌లోకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు సరఫరా చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఒకపక్క డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారుల సమావేశం లో హెచ్చరించిన విషయం తెలిసిందే. మరోపక్క బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో డ్రగ్స్ కలకలం రేపడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులతో హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అత్యవసర సమావేశం నిర్వహించారు.
పబ్‌లో ప్రముఖులు
పబ్‌లో ప్రముఖులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పబ్‌లోని 150 మందిని పోలీసు స్టేషన్‌కు తరలించిన పోలీసులు 148 మంది ఉన్నట్టు మాత్రమే ప్రకటించారు. సినీనటుడు నాగబాబు కూతరు నిహారిక కొణిదెల, ఎంపీ గల్లాజయదేవ్ కుమారుడు సిద్దార్థ్ గల్లా, సింగర్ రాహుల్ సింప్లిగంజ్, డ్రగ్స్ పార్టీలో మాజీ ఎంపీ అంజనీకుమార్ కుమారుడు అరవింద్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ కుమారుడు, ఓ మాజీ డీజీపీ కుటుంబ సభ్యులు ఉన్నారు. మాజీ ఎంపీ అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలకు సంబంధించిన వారు ఉన్నట్టు గుర్తించారు. దీంతోపాటు పబ్‌లో పట్టుబడిన వారిని అర్ధరాత్రి పోలీసు స్టేషన్‌కు తరలించారు. తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నిర్వాహకులను పోలీసులు పబ్‌కి తరలించి విచారణ చేపట్టారు. లోపల మరింత అనుమానిత డ్రగ్ ఉందన్న సమాచారం మేరకు సోదాలు కొనసాగుతున్నాయి. పబ్ బాత్ రూమ్‌లో డ్రగ్స్ వాడి వదిలేసిన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాడిసన్ హోటల్ పుడింగ్ మింక్ పబ్‌ను అధికారులు సీజ్ చేశారు. ఇదిలా ఉండగా, తేజస్వి, కిరణ్‌రాజు, సతీష్‌రాజు పేరుతో పబ్ రిజిస్టర్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. శాంపిల్స్ సేకరించిన పోలీసులు టెస్టుల కోసం పబ్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన మహదారం అనిల్ కుమార్, అభిషేక్‌ను సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.
లిస్టు వైరల్..
పబ్‌లో ఉన్న 148 మంది జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 150 మందిని పోలీసుస్టేషన్‌కు తరలించిన పోలీసులు 148 మంది జాబితాను మాత్రమే ఎందుకు బహిర్గతం చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా తమ కూతురు నిహారిక పబ్‌లో ఉందని స్వయంగా నాగబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాబితాలో మాత్రం నిహారిక, ఆమె స్సేహితురాళ్ల పేర్లు కనిపించడం లేదు. పోలీసులు కావాలనే ఆ రెండు పేర్లను మిస్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాబితాతో తమకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు.
సీపీ అత్యవసర సమావేశం
బంజారాహిల్స్ డ్రగ్స్ ఘటన వెలుగులోకి రావడంతో సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. నగరానికి చెందిన పోలీసు ఉన్నతాధికారులతో సీపీ సీవీ ఆనంద్ ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. అంతకుముందు బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ శివచంద్రను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీచేశారు. దీంతోపాటు సంబంధిత ఏసీపీ సుదర్శన్‌కు చార్జి మెమో జారీ చేేశారు. బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ కొత్త ఇన్స్పెక్టర్గా నాగేశ్వర్రావును నియమించారు. డ్రగ్స్ కేసు విచారణ బాధ్యతలను అప్పగించారు. మరోవైపు.. పబ్ విషయంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. పబ్‌పై గతంలో స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదనీ, పబ్ మాజీ ఎంపీ కుమార్తెది కావడంతో పోలీసులు చూడనట్టు వదిలేశారనీ విమర్శిస్తున్నారు.
పబ్‌ల్లోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు
డ్రగ్స్ కేసులో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అసలు పబ్‌ల్లోకి డ్రగ్స్ ఎలా వచ్చింది అనే దానిపై నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ రంగంలోకి దిగింది. వీఐపీలు, వీవీఐపీల పిల్లల తీరుపై దర్యాప్తు ముమ్మరం చేయాలని నిర్ణయించారు. పబ్ యాజమాన్యం, సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్ సరఫరా చేసిన వాళ్ల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు.
ఎలాంటి సంబంధం లేదు
పుడింగ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో తమకు ఎలాంటి సంబంధమూ లేదని పలువురు ప్రకటించారు. నిహారిక తప్పులేదని పోలీసులు చెప్పారని, ఊహాగానాలు ప్రచారం చేయొద్దని సినీ నటుడు నాగబాబు కోరారు. పబ్‌లో నిహారిక ఉండటం వల్లే స్పందిస్తున్నట్టు తెలిపారు. నిహారిక విషయంలో అంతా క్లియర్‌గానే ఉందని, నిహారిక తప్పు లేదని పోలీసులు చెప్పినట్టు ప్రకటించారు. తన కుమారుడు బర్త్ డే పార్టీకి వెళ్లాడని, ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తే అభాండాలు వేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ అన్నారు. తాను బర్త్‌డే పార్టీకి వచ్చానని ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు. డ్రగ్స్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశాడు. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని నటి హేమ అన్నారు. తన పేరును ప్రసారం చేసిన మీడియా సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుడింగ్ మింక్ పబ్‌తో తన కూతురుకు ఎలాంటి సంబంధమూ లేదని మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి తెలిపారు.