Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాంతీయపార్టీల మద్దతు కూడగట్టేయత్నం
- కంటి పరీక్షలు కూడా...
నవతెలంగాణ - హైదరాబాద్ బ్యూరో
ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఢిల్లీ వెళ్లారు. యాసంగి ధాన్యం కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన నేపథ్యంలో అక్కడే తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయిం చారు. ఈనెల 11న ఢిల్లీలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయనున్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలను సమీకరించి, మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా ఆయన ఢిల్లీ వెళ్లినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే కొంతకాలంగా సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ ఢిల్లీలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న విషయం తెలిసిందే. పనిలో పనిగా కంటి సంబంధ వైద్య పరీక్షలు కూడా చేయించుకునేందుకు డాక్టర్ల అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారని తెలిసింది. అలాగే ప్రధాని నరేంద్రమోడీని స్వయంగా కలిసి ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని విన్నవించాలని కూడా సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దానికోసం ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్మెంట్ కూడా కోరారు. ఆదివారం సాయంత్రం 6గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి దంపతులతో పాటు కుమార్తె కవిత కూడా ఢిల్లీ వెళ్లారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే తెలంగాణలో కూడా ధాన్యం సేకరించాలని పార్లమెంట్లో డిమాండ్ చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేసేందుకు సోమవారం ఉదయం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ వారితో భేటీ కానున్నట్టు సమాచారం.