Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించండి
- వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి టీ హరీశ్‌రావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వైద్యారోగ్యశాఖకు ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని సక్రమంగా వినియోగించుకోవాలని ఆ శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. పేదలకు నాణ్యమైన, అధునాతనమైన వైద్య సేవలను అందించాలని చెప్పారు. ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు రూ. 11,237 కోట్ల నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. సోమవారంనాడాయన నీలోఫర్, గాంధీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, అన్ని విభాగాధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, సీఎం ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు. ఆయా విభాగాల వారీగా పనితీరును సమీక్షించారు. గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాల అమలు, పురోగతిపై ఆరా తీశారు. ఈ ఏడాది కేటాయించిన బడ్జెట్లో ఆస్పత్రుల నిర్వహణకు రూ. 1,100 కోట్లు, మందుల కోసం రూ. 500 కోట్లు, వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం రూ. 300 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.500 కోట్లు, సర్జికల్ కోసం రూ. 200 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. డైట్ చార్జీల కోసం రూ. 43.5 కోట్లు కేటాయించామన్నారు. సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలను రూ.40 నుంచి రూ.80కీ, టీబీ, క్యాన్సర్ రోగులకు రూ.56 నుంచి రూ.112కు పెంచామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ చెల్లింపులను బెడ్‌కు రూ.5,016 నుంచి రూ.7,500లకు పెంచామన్నారు. మెడికల్, నర్సింగ్, పారామెడికల్ సహా అన్ని విభాగాల్లో సిబ్బందిని వంద శాతం నియమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
నీలోఫర్, గాంధీపై నమ్మకం మరింత పెరగాలి..
నీలోఫర్, గాంధీ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా సేవలందించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. రోగులకు అన్ని వేళల్లో అత్యవసర వైద్య సేవలు అందాలని, ఆరోగ్య శ్రీ కేసులు మరింత పెరగాలన్నారు. గాంధీలో మోకాలు, తుంటి ఎముకల మార్పిడి సర్జరీలతో పాటు ఇతర అవయవ మార్పిడి సర్జరీలు పెరగాలన్నారు. సంతానోత్పత్తి వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలన్నారు. సి-సెక్షన్ డెలివరీలు తగ్గించి, సాధారణ డెలివరీలు ఎక్కువగా జరిగేలా చూడాలన్నారు. మాతా, శిశు మరణాలు జరగకుండా చూడాలనీ, విభాగాల వారీగా జిల్లాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకి వైద్య సేవలను చేరువ చేయాలనీ గాంధీ వైద్యులకు సూచించారు. కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్స విషయంలో గాంధీ వైద్యులు, సిబ్బంది బాగా పని చేశారని అభినందించారు.
వైద్యులకు 7న సన్మానం
నీలోఫర్ ఆసుపత్రిలో ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు తీసుకునేందుకు వీలుగా బాక్స్‌లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. త్వరితగతిన సమస్యలు పరిష్కరించుకునేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. బాగా పని చేసే వైద్యులకు ఈనెల 7న వరల్డ్ హెల్త్ డే పురస్కరించుకొని నగదు పురస్కారం, సన్మానం చేస్తున్నట్టు చెప్పారు. నీలోఫర్ ఆస్పత్రి విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న 800 పడకల బ్లాక్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.