Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక శాఖకు టీఎస్జీసీసీఎల్ఏ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు సంబంధించి టోకెన్ నెంబర్ వచ్చిన జిల్లాల్లో వేతనాలు చెల్లించాలంటూ ఆర్థిక శాఖను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (టీఎస్జీసీసీఎల్ఏ-475) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేష్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్టు అధ్యాపకుల పెండింగ్ వేతనాలతోపాటు జనవరి, ఫిబ్రవరి, మార్చి జీతాలనూ ఆర్థిక శాఖ మంజూరు చేసిందని తెలిపారు. డిగ్రీ, ఇంటర్ విద్యా కమిషనర్లు ఆ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని గుర్తు చేశారు. డీడీవోలుగా ఉన్న కాలేజీల ప్రిన్సిపాళ్లు సకాలంలో జిల్లా కోశాధికారికి బిల్లులు పంపించారని వివరించారు. వాటికి సంబంధించిన టోకెన్లు వచ్చినా కొన్ని జిల్లాలకు ఒకటి, రెండు నెలలు మాత్రమే కాంట్రాక్టు అధ్యాపకుల జీతాలు ఆర్థిక శాఖ విడుదల చేసిందని పేర్కొన్నారు. మరికొన్ని జిల్లాల్లో టోకెన్ నెంబర్లు ఇచ్చినా వేతనాలు విడుదల చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కాంట్రాక్టు అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. మళ్లీ బిల్లులు పంపాలంటే చాలా సమయం పడుతుందని తెలిపారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కాంట్రాక్టు అధ్యాపకులకు జీతాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.