Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆప్ నేత ఇందిరాశోభన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగానికి రాష్ట్ర కేంద్రంగా మారిందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఇందిరాశోభన్ విమర్శించారు. డ్రగ్స్‌ఫ్రీ రాష్ట్రంగా మార్చాలంటూ స్వయంగా సీఎం కేసీఆర్ ఆదేశించినా.. మత్తు పదార్థాల వినియోగాన్ని కట్టడి చేయడంలో పోలీసు, ఎక్సైజ్ శాఖలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో గుట్కాలు, గంజాయిని యథేచ్చగా అమ్ముతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు. రాష్ట్రం వచ్చాక బారులకు, పబ్‌లకు పెద్ద మొత్తంలో మంజూరు చేసిన ప్రభుత్వం, ఆదాయంపై దృష్టి పెట్టిందే తప్ప, దాని వల్ల వచ్చే అనర్థాలను పట్టించుకోలేదని విమర్శించారు.
ఏదైనా సంఘటన వెలుగులోకి వచ్చినప్పుడు హడావుడి చేయడం తప్ప, ప్రభుత్వం ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదని చెప్పారు. పోలీసు శాఖలో కొందరు పబ్‌లు, క్లబ్‌ల నిర్వాహకులతో అంటకాగుతుండడంతో డ్రగ్స్‌పై తనిఖీల ఊసే ఉండడం లేదని విమర్శించారు. పోలీసుల కనుసన్నల్లో ఈ పబ్‌ల బాగోతం నడుస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి పోలీసు, ఎక్సైజు సిబ్బందితో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినా...ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా డ్రగ్స్ కేసు వ్యవహారంపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.