Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే కొత్త వేతనాలివ్వాలి
- 13న అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు
- 28న మున్సిపల్ ఆఫీసులు, మే 9న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలనీ, వెంటనే కొత్త వేతనాలను అమలు చేయాలని మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 13న మున్సిపల్ కార్మికులు అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు ఇస్తారనీ, 28న మున్సిపల్ ఆఫీసుల ఎదుట ధర్నాలు చేస్తారని ప్రకటించారు. అప్పటికీ స్పందించకపోతే మే 9న కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఖమర్అలీ అధ్యక్షతన రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేస్తామని, 90 వేలకు పైగా ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ పట్టణ ప్రజలకు సేవలందిస్తున్న మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగ, కార్మికుల పర్మినెంట్ను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ప్రజా ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, పారిశుధ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మినెంట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల పర్మినెంట్, జీఓ నెం.4 అమలు చేయాలనీ, ఏరియర్స్ చెల్లింపు, డైలీవేజ్, కాంట్రాక్ట్ కార్మికులకు కూడా కొత్త వేతనాలను నెలకు రూ.15,600 చెల్లించాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు కూడా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల హక్కుల కోసం దశలవారీగా పోరాటాలు చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో కార్యనిర్వాహక అధ్యక్షులు జనగాం రాజమల్లు, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు అంజయ్య, అశోక్, నాగమణి, ఎడ్ల నర్సింహులు, ఎ. అశోక్, జె. రవి, వెంకటస్వామి, పి. సుధాకర్, వాణి, విష్ణు, కిషన్, యాదమ్మ, గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ Ê వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.