Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్ఎన్ఎల్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సమరశీల ఉద్యమాలు : వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
- వ్యవసాయ కార్మిక ఉద్యమానికి బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల రూ.2 లక్షల విరాళం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ ప్రజలందరి బాధ్యత అనీ, బీఎస్ఎన్ఎల్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సమరశీల ఉద్యమాలు చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పిలుపునిచ్చారు. భారత్ టెలికాం సంస్థ, బీఎస్ఎన్ఎల్ లేకపోతే గ్రామీణ ప్రాంతాలకు నెట్వర్క్ వచ్చేదే కాదనీ, వేల కోట్ల రూపాయలను వెచ్చించి మారుమూల గ్రామాలకు నెట్వర్క్ని విస్తరించే ప్రయివేటు టెలికాం సంస్థలు అప్పనంగా వాడుకుంటున్నాయని విమర్శించారు. అస్సాం రాజధాని గౌహతిలో జరిగిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం జాతీయ మహాసభలో ఆయన పాల్గొన్నారు. దేశంలో జరుగుతున్న వ్యవసాయ కార్మిక పోరాటాలకు మద్దతుగా ప్రతి బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి రూ.5 చందా వేసుకోగా వచ్చిన 2 లక్షల రూపాయలను బి.వెంకట్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఎస్ఎన్ఎల్ ప్రయివేటీకరణ జరిగితే సామాన్య ప్రజలకు, గ్రామీణులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ కష్టకాలంలో కమ్యూనికేషన్ సిస్టమ్‌ని ప్రయివేటు సంస్థలు వ్యాపారం చేసుకుంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ విద్యారంగానికి నెట్వర్క్ సేవలను అందజేసి తన విశాల హృదయాన్ని చాటిచెప్పిందన్నారు. ఆప్టిక్ ఫైబర్ ద్వారా తన బాధ్యతగా ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రభుత్వ విద్యా సంస్థలకు నెట్వర్క్ నందించిందన్నారు. ప్రభుత్వ రంగానికి సామాజిక బాధ్యత, ప్రజా సౌకర్యం గీటురాయి అన్నారు. రిలయన్స్, జియో లాంటి కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకోవడమే లక్ష్యంగా ఉంటుందని విమర్శించారు.
ఒకవైపున మానిటైజేషన్ పైప్‌లైన్‌తో ప్రభుత్వ రంగానంతా అమ్మేస్తూ.. రెండో వైపున ప్రభుత్వ భూములు, పేదలు పోరాడి సాధించుకున్న భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టేందుకు పథకం రూపొందించిందని అన్నారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఆ సంస్థ పరిరక్షణ కోసం చేస్తున్న కృషిని అభినందించారు. ప్రభుత్వాధీనంలోని భూములను శ్రామిక ప్రజల చేతుల్లోనీ భూములను కార్పోరేట్లకు కట్టబెట్టే చర్యలకు వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమం చేస్తున్నదనీ, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు సామాన్య ప్రజలకు మొబైల్ నెట్‌వర్క్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలను కాపాడుకునేందుకు ఐక్య ఉద్యమాలు సాగించాలని ఆయన పిలుపునిచ్చారు.