Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం
- పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలి: జిల్లాల్లో సీపీఐ(ఎం) నిరసనలు
నవతెలంగాణ - విలేకరులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకపాలన చేస్తూ ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నాయని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జంగంమేట్ ఫలక్నామా రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న చెరుపల్లి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలకు, బడా పెట్టుబడిదారులకు రాయితీలు ఇస్తూ ప్రజలపై భారాలు మోపుతున్నాయన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి కోలుకోని పేద, మధ్య తరగతి ప్రజలపై కనీసం కనికరం లేకుండా ధరలు పెంచేస్తూ అవస్థలపాలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే.. ప్రజలను సంఘటితం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. గుడిమల్కాపూర్ చౌరస్తా వద్ద ధరల పెంపుపై నిరసనలు వ్యక్తం చేశారు.
యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొండమడుగు నర్సింహ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మోటకొండూరు మండలంల ఆరెగూడెంలో రాస్తారోకో చేశారు. నల్లగొండ పట్టణంలో కట్టెల పొయ్యిపై వంట చేసి, సిలిండర్‌కు పూలమాల వేసి ఆందోళన నిర్వహించారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలకేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందికొండ గీత ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు.