Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
- ఇతర పార్టీల మద్దతూ కూడగట్టండి
- పీయూష్గోయల్పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ధాన్యం కొనుగోలు కోసం కేంద్రంపై పోరాటం విషయంలో ఎక్కడా ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గొద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలో ఆయన సోమవారం పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. పార్లమెంటులో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జరుగుతున్న ఆందోళనలను కూడా ఆయన సమావేశంలో ప్రస్తావించారు. ఈనెల 11న ఢిల్లీలో జరిగే ధర్నాకు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలిరానున్న నేపథ్యంలో ఏర్పాట్లపైనా ఆయన సమీక్ష నిర్వహించారు. అప్పటి అవసరాన్ని బట్టి తాను కూడా ఆ ధర్నాలో పాల్గొంటానని వారికి చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్మెంట్ కూడా కోరినందున, అటునుంచి అనుమతి వస్తే సమస్యను అక్కడ పరిష్కరించుకొనే ప్రయత్నం చేద్దామనీ, అలా జరక్కుంటే ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగుతుందనీ ఎంపీలకు స్పష్టంచేసినట్టు సమాచారం.అదే సమయంలో పార్లమెంటులో ఇతర పార్టీల ఎంపీల మద్దతునూ కూడగట్టాలనీ, అవసరమైతే పార్లమెంటు వెలుపల తాను ఆయా పార్టీల అధినేతల్ని స్వయంగా కలిసి, మద్దతు కోరతాననీ చెప్పినట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిమాండ్ పరిష్కారం అయ్యేవరకు వెనకడుగు వేయోద్దనీ, రాష్ట్ర ప్రజలు కూడా కేంద్ర వైఖరిని అర్థం చేసుకుంటున్నారనీ చెప్పారు. సీఎం కేసీఆర్ సోమవారం భార్య శోభ, కుమార్తె కవితతో కలిసి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై సభా హక్కుల నోటీసు-కేకే
డబ్ల్యూటీఓ ఆంక్షలతో పారా బాయిల్డ్ రైస్‌ను విదేశాలకు ఎగుమతి చేయడం లేదంటూ రాజ్యసభలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటును తప్పుతోవ పట్టించారని పేర్కొంటూ ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చినట్టు టీఆర్ఎస్ పార్లమెంటరీపార్టీ నేత కే కేశవరావు తెలిపారు. ఈ మేరకు ఉల్లంఘన లేఖను రాజ్యసభ ఛైర్మెన్, లోక్‌సభ స్పీకర్‌కు అందజేశారు. రూల్ 187 కింద సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినట్టు తెలిపారు. అంతకుముందు వారితో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అనంతరం కే కేశవరా వు పార్టీ ఎంపీలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బియ్యాన్ని ఎగుమతి చేయట్లేదంటూ కేంద్రం అబద్ధాలు చెప్తోందని టిఆర్ఎస్ పార్లమెంట రీ పార్టీ నేత కే కేశవరావు (కేకే) ఆరోపించారు. పారా బాయిల్డ్ రైస్‌ను కేంద్రం ఎగుమతి చేస్తోందని.. అలాంటప్పుడు తెలంగాణలో ధాన్యం ఎందుకు సేకరించడం లేదని ప్రశ్నించారు. కేంద్రం బియ్యం ఎగుమతులు చేస్తోందంటూ దానికి సంబంధించిన పత్రాలను మీడియాకు విడుదల చేశారు. ఏడేండ్లుగా దేశంలో ప్రయివేటీకరణ విపరీతంగా పెరిగిందనీ, కేంద్రం ప్రతి అంశాన్నీ వ్యాపారం, లాభం కోణంలోనే చూస్తున్నదని విమర్శించారు. శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు పారా బాయిల్డ్ రైస్ అడుగుతున్నా యనీ, కేంద్రం ధాన్యాన్ని సేకరించి ఆయా దేశాలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులు ఎప్పుడూ కేంద్రమంత్రులను బెదిరించలేదనీ, ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తులు మాత్రమే చేశామన్నారు.