Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న మోడీ సర్కారు
- మతతత్వం, పెట్టుబడిదారీ విధాన విషకూటమితో తీవ్రనష్టం
- దేశరాజకీయాల్లో కమ్యూనిస్టుల అవసరం ఎంతో ఉంది:
సెమినార్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
- 23 పార్టీ పతాకాలతో ఎస్వీకే వద్ద ప్రదర్శన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దోపిడీ, పీడన, ఆధిపత్యం, వివక్ష లేని సమాజ నిర్మాణమే వామపక్ష పార్టీల లక్ష్యమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. దేశ రాజకీయాల్లో వామపక్షాల పాత్ర ఎంతో కీలకమనీ, ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిస్టుల అవసరం ఇప్పుడు మరింత ఎక్కువుందని చెప్పారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అఖిల భారత మహాసభల సందర్భంగా 'భారతదేశ భవిష్యత్తు-వామపక్షాల పాత్ర'అనే అంశంపై సెమినార్ జరిగింది. అంతకుముందు బుధవారం నుంచి ఈనెల పదో తేదీ వరకు కేరళలోని కన్నూర్‌లో జరిగే సీపీఐ(ఎం) 23వ అఖిల భారత మహాసభల సూచకంగా 23 పార్టీ పతాకాలతో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, పలువురు రాష్ట్ర కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) నుంచి సుందరయ్య పార్క్ చుట్టూ ప్రదర్శన నిర్వహించారు. 'సీపీఐ(ఎం) జిందాబాద్, వర్ధిల్లాలి మార్క్సిజం, లెనినిజం, సీపీఐ(ఎం) అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలి'అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య అధ్యక్షతన జరిగిన సెమినార్‌నుద్దేశించి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఫ్యూడల్ భావజాలంతో కూడిన మతోన్మాదం అభివృద్ధికి ఆటంకమని అన్నారు. దోపిడీయే పెట్టుబడిదారీ విధానమని చెప్పారు. మతోన్మాదం, పెట్టుబడిదారీ విధానం దేశానికి తీవ్రనష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో ఆ రెండూ విషకూటమిగా ఏర్పడి పరస్పరం సహకరించుకుంటున్నాయని విమర్శించారు. అందుకే ఒకే మార్కెట్ కోసమే జీఎస్టీని తెచ్చారని వివరించారు. బ్రిటీష్ వారిని వెళ్లగొట్టేందుకు అందరం భారతీయులం అన్న భావనతో జాతీయోద్యమం సాగిందని గుర్తు చేశారు. ఇప్పుడు హిందువులం అన్న భావనతో బీజేపీ రాజకీయాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నదని చెప్పారు. లాభాలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడమే నయా ఉదారవాద విధానాల లక్ష్యమని విమర్శించారు. అందుకే ప్రభుత్వరంగ సంస్థలను, ఆస్తులను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కారుచౌకగా కార్పొరేట్లకు అప్పగిస్తున్నదని చెప్పారు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం వల్లే అంబానీ, అదానీల ఆస్తులు పెరుగుతున్నాయని వివరించారు. మతోన్మాదాన్ని, నయాఉదారవాద విధానాలను కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, డీఎంకే, ఏఐడీఎంకే వంటి పార్టీలు వ్యతిరేకించడం లేదన్నారు. మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నదని విమర్శించారు. లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక స్వావలంబన, సామాజిక న్యాయం, ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలుగుతున్నదని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. ఎన్నికల విధానం మారాలనీ, దామాషా పద్ధతిలో ఉండాలని వామపక్షాలు కోరుకుంటున్నాయని చెప్పారు. ఎన్నికల బాండ్లను తీసేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచశాంతిని కమ్యూనిస్టులు కోరుకుంటున్నారని వివరించారు. ప్రపంచంలో అమెరికా సామ్రాజ్యవాదం ఆధిపత్యం కొనసాగుతున్నదని అన్నారు. చైనా అన్ని రంగాల్లో అమెరికాకు దీటుగా ఎదుగుతున్నదని చెప్పారు. దోపిడీ, పీడన లేని సమాజం నిర్మించాలంటే ఇప్పటివరకు మార్క్సిజం, లెనినిజం మాత్రమే సైద్ధాంతికంగా ఉందన్నారు. భవిష్యత్తు వామపక్షాలదేనని అన్నారు. ప్రజాసమస్యలపై పోరాటాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి జ్యోతి మాట్లాడుతూ అట్టడుగు వర్గాలు, మహిళలు పోరాడి సాధించుకున్న హక్కులను మోడీ సర్కారు హరిస్తున్నదని చెప్పారు. ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయం వామపక్షాలేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బి వెంకట్, జాన్‌వెస్లీ, డిజి నరసింహారావు, ఎండీ అబ్బాస్, టి సాగర్ తదితరులు పాల్గొన్నారు.