Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారి సహాయంతో వల వేస్తున్న కాంట్రాక్టర్
- మత్స్యసహకార సంఘం సభ్యులకు తెలియకుండా వ్యవహారం
- కుమ్మక్కైన ఎఫ్డీఓ, కాంట్రాక్టర్
- కార్మికులకు ఉపాధి చూపాలని స్థానికుల డిమాండ్
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పేదలంతా భూములు వదిలిపెడితే ఓ రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. ఆ సమయంలో భూములు కోల్పోయిన, గ్రామాల నుంచి తరిలిపోయిన వాళ్లకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటామని నాటి పాలకులు అధికారులు చెపుకొచ్చారు. కానీ ఎలాంటి మేలు జరగలేదు సరికదా.. మత్స్యకార్మికులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రిజర్వాయర్లో ప్రభుత్వం చేపలు వదిలితే.. గతంలో నష్టం వచ్చిందన్న సాకుతో కాంట్రాక్టర్ దోచుకుంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు లేరు. సొసైటీ సభ్యులకు దక్కాల్సిన చేపలు.. కాంట్రాక్టర్ జేబుల్లోకి కాసుల రూపంలో వెళ్లిపోతున్నాయి. ఇదీ నల్లగొండ జిల్లా అక్కంపల్లి రిజర్వాయర్లో జరుగుతున్న తంతు.
నల్లగొండ జిల్లాలో పెద్ద రిజర్వాయర్లలో అక్కంపల్లి రిజర్వాయర్ ఒకటి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పునరావాస గ్రామాలు అక్కంపల్లి, పెద్దఅడిశర్లపల్లి. చిట్యాల, దుగ్యాల, అంగటిపేట ప్రజలు కూడా భూములు కోల్పోయారు. మత్స్యశాఖ ఆధీనంలో ఉన్న ఈ ప్రాజెక్టులో సభ్యులు సుమారు 614 మంది ఉన్నారు. అందులో ఇప్పటి వరకు దాదాపు 100 చనిపోగా.. ప్రస్తుతం 514 మంది ఉన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి జీవో నెం.74 ప్రకారం చెరువుపై సొసైటీ ఏర్పాటు చేసి సభ్యత్వం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే మరో 500మంది వరకు అర్హత కలిగిన కార్మికులు సభ్వత్యం కోసం దరఖాస్తు చేసి ఉన్నారు. 2016-17లో వృత్తి పరీక్ష నిర్వహించాలని మత్స్యశాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వస్తే.. స్థానిక నాయకులు అడ్డుకుని ఇప్పటివరకు నిర్వహించలేదు.
ఉచితంగా చేపపిల్లలు..
మత్స్యకారులకు ఉపాధి కల్పించడం కోసం చెరువులు, రిజర్వాయర్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేసింది. అవి పెరిగి పెద్దగా అయిన తర్వాత మత్స్య కార్మికులు ఉచితంగానే పట్టుకుని విక్రయించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే రెండేండ్లుగా చేపలు పోశారు.
కాంట్రాక్టర్, ఎఫ్డీవో కుమ్మక్కై ఇలా..
2020 నవంబర్ 10న మత్స్యసహకార సంఘం పాలకవర్గం గడువు ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు జరగలేదు. అందువల్ల మత్స్యశాఖ డివిజన్ అధికారి (ఎఫ్డివో) పర్సన్ ఇన్చార్జీగా నియమితులయ్యారు. నాటి నుంచి సంఘం ఆర్థిక లావాదేవీలు, ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాలు పూర్తిగా అయన పరిధిలోనే కొనసాగుతున్నాయి. గతంలో రిజర్వాయర్ లీజుకు తీసుకుంటే నష్టం వచ్చిందనే పేరుతో కాంట్రాక్టర్ డివిజన్ అధికారికి మొరపెట్టుకున్నారు. దాంతో పాలకవర్గం లేనందున సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా దాదాపు 7 నెలల కింద ప్రాజెక్టులో చేపలు పట్టుకోవడానికి కాంట్రాక్టర్కు అనుమతి ఇస్తున్నట్టు ఒప్పంద పత్రం రాసుకున్నారు. కానీ ఈ విషయం మాజీ పాలకవర్గానికి లేదా సంఘం సభ్యులకు ఏ మాత్రం సమాచారం లేదు. ఆ కాంట్రాక్టర్, అధికారి కలిసి కార్మికులకు చెందాల్సిన రొయ్యలను పట్టి మార్కెట్ అమ్ముకుంటున్నారు. ఉచితంగా పంపిణీ చేసిన చేపపిల్లలను కార్మికులకు చెందకుండా అధికార పార్టీ నేతలు కాంట్రాక్టర్కు దోచుకునేలా ప్రత్యక్షంగా సహకారం అందిస్తున్నారన్న విమర్శలున్నాయి. రొయ్య పిల్లలు కిలోకు రూ.450నుంచి 500వరకు ఉంటుంది. అదే ఇతర రాష్ట్రాలకు వెళ్లితే సుమారు రూ.1200కుపైగా ధర పలుకుతుంది. ఈ రిజర్వాయర్ నుంచి రోజుకు దాదాపు రూ.లక్షకు పైగా వ్యాపారం జరుగుతున్నట్టు స్థానిక కార్మికులు పేర్కొంటున్నారు. అక్రమంగా చేపలు పడుతున్న విషయంపై సొసైటీ కార్మికులు గతంలోనే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పిటిషన్ తిరస్కరించినట్టుగా ఆవేదన వ్యక్తం చేశారు.
వారిపై చర్యలు తీసుకోవాలి
మద్దిమడుగు సదానందం- ఏకేబీఆర్ మత్స్యసహకారం సంఘం మాజీ అధ్యక్షులు
కార్మికుల జీవనాధారం కోసం ప్రభుత్వం ఉచితంగా వేసిన చేపలను కాంట్రాక్టర్ అక్రమంగా పట్టుకుంటున్నాడు. ఇక్కడ పేద కార్మికులకేమో పూటగడవని పరిస్థితి. రిజర్వాయర్లో అక్రమంగా చేపలు పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్థానిక మత్స్య కార్మికులకు ఉపాధి కల్పించాలి.
మత్స్యశాఖ అధికారి రక్షణ ఇవ్వమన్నారు పీఏపల్లి ఎస్ఐ వీరబాబు
ప్రాజెక్టులో ఎవరూ చేపలు పట్టకుండా రక్షణ కల్పించాలని స్థానిక మత్స్యశాఖ అధికారి అడిగారు. దానికి సహకారం అందిస్తామని అందరికీ తెలిసేలా ప్రచారం కూడా చేశాం.
చేపలు పట్టే వారిని వెళ్లిపొమ్మన్నాం..
మోల్గూరి వెంకయ్య- నల్లగొండ జిల్లా మత్స్యశాఖ అధికారి
ప్రాజెక్టులో చేపలు పట్టే వారు, వారికి సంబంధించిన కాంట్రాక్టర్ను అక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నాం. లేకపోతే ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక చేశాం. అయితే, వారు అక్కడి నుంచి సర్దుకుని పోవాలంటే రెండు రోజులు సమయం పడుతుంది. కానీ చేపలు పట్టడం పూర్తిగా నిలిపివేశారు.