Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సొసైటీలలో సభ్యత్వం మత్స్యకారుల అక్కుని అర్హులైన ప్రతి ఒక్కరికీ సభ్యత్వం కల్పిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల రిజిస్ట్రేషన్ స్పెషల్ డ్రైవ్‌కు సంబంధించిన పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకుని వారికి వివిధ రకాల పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. రాష్ట్రంలో నూతన నీటి వనరుల విస్తీర్ణం భారీగా పెరగడం, దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్య సంపద కూడా భారీగా పెరిగిందని వివరించారు. సంపదను సృష్టించాలి...దానిని పేదలకు పంచాలనే ఆలోచనల మేరకు రాష్ట్రంలో పెరిగిన మత్స్య సంపదను ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రతి మత్స్యకారుడికి అందిస్తామని చెప్పారు. అందులో భాగంగానే నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఏర్పాటు, నూతన సభ్యత్వంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 4,753 సొసైటీలున్నాయనీ, అందులో 3,47,901 మంది సభ్యులుగా ఉన్నారని వివరించారు. ఇంకా 1,185 సంఘాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. మే 15 వ తేదీ లోగా 100 శాతం సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తమకు సభ్యత్వం రాలేదని అర్హులైన ఏ ఒక్క మత్స్యకారుడు అనేందుకు అవకాశం ఇవ్వొద్దని అధికారులకు స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా సభ్యత్వ నమోదు చేపట్టాలని స్పష్టం చేశారు. 18 సంవత్సరాలు నిండిన మత్స్యకార కులాలకు చెందిన వారిని అర్హులుగా గుర్తించాలని సూచించారు. అదేవిధంగా జీవో 98 లో పేర్కొన్న 30 మత్స్యకార కులాలకు చెందిన వారు అర్హులు అవుతారని (సంబంధిత తహసిల్దార్ జారీ చేసిన కుల ధృవీకరణ ను పరిగణనలోకి తీసుకోవాలని) చెప్పారు. స్థానికంగా నివాసం ఉంటున్న వారు అర్హులు అని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు సభ్యత్వం పొందేందుకు అనర్హులు అవుతారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలలో మత్స్యకార సంఘాల ఏర్పాటుకు స్థానిక గిరిజనులు మాత్రమే అర్హులు అనీ, మత్స్యకార వృత్తిపై నైపుణ్యం లేని వారికి అవసరమైన శిక్షణ ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.