Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ ఉత్పత్తికి వాడుతున్నారంటూ కేఆర్ఎంబీకి ఫిర్యాదు
- అసహనంలో కేసీఆర్ ప్రభుత్వం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలుగురాష్ట్రాల మధ్య సాగునీటి సమస్యలు అంతకంతకు ముదురుతూనే ఉన్నాయి. చీటికిమాటికి ఫిర్యాదులు చేసుకోవడమే ఇందుకు సాక్షం. ఇటీవల వేసవి నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకూడదనే లక్ష్యంతో నాగార్జునసాగర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీశైలంలోకి నీటిని తెచ్చారు. దీన్ని ఏపీలోని జగన్ సర్కార్ తప్పుబట్టింది. సాగర్ నుంచి తోడుకున్న నీటితో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నదంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కు రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. దీనిపై కేసీఆర్ సర్కారు అసహానంతో ఉంది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పందించారు. ఏపీ ప్రభుత్వం చిల్లరవేషాలు వేస్తున్నదని మంగళవారం మీడియాతో విమర్శలు చేశారు. సాధారణంగా జరిగే పనులకు ఏపీ భూతద్దంలో చూడటం సరికాదన్నారు. ఇదిలావుండగా రెండు వారాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం వేసవితోపాటు జూన్, జులై, ఆగస్టు వరకు రాష్ట్రంలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. రివర్స్ పంపింగ్‌తో రాష్ట్రంలోని సుమారు ఆరు జిల్లాలకు తాగునీటి ముప్పు తప్పిందని అధికారులు అంటున్నారు. ఇదిలావుండగా తాజా వేసవిలో శ్రీశైలంలో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. దీంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు తప్పవని మిషన్ భగీరథ ఉన్నతాధికారులు భావించారు. వెంటనే సీఎం కేసీఆర్ దృష్టికి ఈనెల 23న తీసుకెళ్లారు. అప్రమత్తమైన సీఎం, వెంటనే మిషన్ భగీరథ, జెన్కో, ఇరిగేషన్ అధికారులకు నాగార్జునసాగర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీశైలంలోకి నాలుగు నుంచి ఐదు టీఎంసీల నీటిని తరలించేలా ఆదేశాలు జారీచేశారు. దీంతో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాలకు నీటి సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. దీనిపై ఏపీ సర్కారు రాద్ధాంతం చేయడం మంచి పరిణామం కాదనీ మిషన్ భగీరథ, జెన్కో, ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు అంటున్నారు. అంతేగాక తాగునీటి కోసం రివర్స్ పంపింగ్ చేసుకోవచ్చని కేఆర్ఎంబీ ఇంతకుముందే చెప్పిందని అని కూడా అభిప్రాయపడుతున్నారు. తాగునీటి అవసరాల కోసం నీటిని రివర్స్ పంపింగ్ చేస్తే రాజకీయం చేయడం సమంజసం కాదనే వ్యాఖ్యానాలు సర్కారు నుంచి వస్తున్నాయి. శ్రీశైలం నుంచి రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తిని నిలిపేసినా, ఏపీ సర్కారు మాత్రం ఇంకా కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయినా తాము చిల్లర ఫిర్యాదులు చేయడం లేదని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వానికి నీటి యాజమాన్యంపై అవగాహన లేదనీ, అందుకే అనవసరంగా ఫిర్యాదు చేస్తున్నదని విమర్శించారు.