Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ విధానాలే పెట్రో, గ్యాస్ ధరల పెరుగుదలకు కారణం
- వామపక్ష, ప్రజాతంత్ర లౌకిక పార్టీల సమావేశం తీర్మానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యుత్, ఆర్టీసీ చార్జీలను పెంపును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్ష, ప్రజాతంత్ర లౌకక పార్టీల సమావేశం డిమాండ్ చేసింది. పెరుగుతున్న ధరలను కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పోరాల్సింది పోయి విద్యుత్, ఆర్టీసీ చార్జీలను పెంచడం అన్యాయమని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నాయకులు కె రమ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ఝాన్సీ, చలపతిరావు, యంసీపీఐ(యు) రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వనం సుధాకర్, ఎస్‌యుసీఐ నాయకులు భరత్, ఆర్ఎస్పి నాయకులు జానకిరాములు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 'వామపక్ష, ప్రజాతంత్ర లౌకిక పార్టీల సమావేశం మంగళవారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్రకార్యాలయంలో సీపీఐ రాష్ట్రకార్య దర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగింది. సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీర్మానాలను సమావేశం ముందుంచారు. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం అడ్డూ అదుపు లేకుండా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచడాన్ని ఖండించారు. ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రాని దేనని స్పష్టం చేశారు. ఈ సమస్యను టీఆర్ఎస్, బీజేపీ పార్టీల సమస్యగా చేస్తూ అయోమయానికి గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర రైతుల సమస్యగా పరిగణించి, అన్ని పక్షాలను కలుపుకొని పోవాలని సూచించారు. 'కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ధరల యుద్ధం ప్రకటించింది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను అడ్డూ అదుపు లేకుండా పెంచుతున్నది. వారం రోజులుగా aప్రతిరోజూ సగటున 60 పైసలు చొప్పున పెంచుతూ పోతున్నది. పెట్రోల్ రూ 118, డీజిల్ రూ 105కి పెరిగింది. ఇంకెంత పెరుగుతుందో అంతులేదు. ఈ ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతున్నది. అన్ని నిత్యావసరాల ధరలు 30 నుండి 40శాతం పెరిగాయి' అని పేర్కొన్నారు. 'ఆయిల్ ధరల పెరుగుదలకు రష్యా -ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపడం ప్రజలను మోసం చేయటమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం పెంచుకోవటానికి, ప్రజల సంపదను కార్పోరేట్లకు దోచి పెట్టటానికే ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్నాయి. కోవిడ్‌తో సత మతమవుతున్న సామాన్యుల జీవనం ధరాభారంతో దుర్భరంగా మారింది. కేంద్ర ప్రభుత్వ అపసవ్య విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాడాల్సిన అవసరం ఉంది' అని తెలిపారు. 'కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం బాటలోనే నడు స్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన సాధా రణ ప్రజల జీవనం అల్లకల్లోలమవుతున్నది. ప్రజల పట్ల బాధ్యత కలిగిన వామపక్షాలు ధరల పెరుగు దలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. తక్షణమే ధరలను తగ్గించాలనీ, లేనిపక్షంలో ఈ నెల 13న సమావేశం నిర్వహించి ఐక్య పోరాట కార్యక్రమాన్ని, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాలని సమావేశం తీర్మానించింది' అని పేర్కొన్నారు.