Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18న హైదరాబాద్లో 'రాష్ట్ర సదస్సు'
- ఏఐఏడబ్ల్యూయూ, బీకేఎంయూ, డీబీఎఫ్-పీఎంసీ సంఘాల వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామీణ ఉపాధి హామీ పనులను పట్టణ ప్రాంతాల్లోనూ విస్తరించాలని ఏఐఏడబ్ల్యూయూ, బీకేఎంయూ, డీబీఎఫ్-పీఎంసీ సంయుక్త సమావేశం డిమాండ్ చేసింది. ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం ఈ నెల 18న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నామనీ, అందులో ముఖ్య వక్తలుగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, బీకేఎంయూ జాతీయ అధ్యక్షులు ఎన్.పెరియార్ స్వామి పాల్గొంటారని తెలిపింది. ఈ సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది. మంగళవారం హైదరాబాద్లోని బీకేఎంయూ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఏడబ్ల్యూయూ జాతీయ కమిటీ సభ్యులు బి.ప్రసాద్, బీకేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.బాలమల్లేశ్, అధ్యక్షులు కలకొండ కాంతయ్య మాట్లాడారు. రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనులను, నిధులను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పథకం ప్రకారం తగ్గిస్తూ పోతున్నదని విమర్శించారు.. కేంద్ర బడ్జెట్లో'ఉపాధి'కి రూ 25 వేల కోట్ల నిధులను కుదించిందని తెలిపారు. మరోవైపు పేదలు వాడే నిత్యావసర సరుకుల ధరలు, వంటగ్యాస్,పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచుతూ బతుకు భారంగా మారుస్తున్నదని విమర్శించారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా రోజు వేతనాలను పెంచడం లేదనీ, పని చేసిన దగ్గర కొలతల పేరుతో వేతనాలను కుదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులందరికీ కలిపి 100 రోజుల పని కల్పన వలన పనిదినాలు సరిపడా లేక వలసలు పోతున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం పనులను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద చేసిన పనులకు కూలీలకు మూడు నెలలకోసారి వేతనాలివ్వడం దుర్మార్గమన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.