Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ వెళ్లిన గవర్నర్ : అక్కడే ఉన్న సీఎం కేసీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం రాత్రి ఢిల్లీకి బయల్దేరి వెళ్ళారు. ఆమె సోమవారమే ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా, అనివార్య కారణాలతో అది రద్దు అయింది. తాజాగా మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కూడా ఢిల్లీలోనే ఉన్న విషయం తెలిసిందే. గవర్నర్ తమిళసై బుధవారం కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికీ, గవర్నర్‌కు మధ్య వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించడంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె సమ్మక్క-సారలమ్మ జాతర, యాదగిరిగుట్ట క్షేత్రాలకు వెళ్లినప్పుడు ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా ఆమెను అవమానించారనే ప్రచారమూ జరిగింది. గవర్నర్ నివాసంలో నిర్వహించిన ముందస్తు ఉగాది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం బహిష్కరించింది. దీనిపై అదే రోజు గవర్నర్ తీవ్రంగానే స్పందించారు. పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ డిల్లీలో ఉండగానే, గవర్నర్ కూడా ఢిల్లీకి వెళ్లి హౌంమంత్రి అమిత్‌షాను కలవనుండటం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. వీలైతే ఆమె ప్రధాని నరేంద్రమోడీని కూడా కలుస్తారని గవర్నర్ కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి.