Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాధారణ ప్రసవాలకు ప్రోత్సాహకాలు :హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) స్థాయికి ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించాలని నిర్ణయించినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా అన్ని పీహెచ్‌సీలు నమోదు చేసుకోవాలని సూచించారు. పీహెచ్‌సీల పనితీరుపై మంగళవారం హైదరాబాద్ నుంచి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.. అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజరీ సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పీహెచ్‌సీల పరిధిలో ప్రజల ఆరోగ్య పరిస్థితులు, వారికి అందుతున్న వైద్య సేవలు, వ్యాక్సినేషన్, ఎన్సీడీ స్క్రీనింగ్, మందులు, పరీక్షలు తదితర అంశాలపై సమీక్షించారు. సాధారణ ప్రసవాలు పెంచాలనే లక్ష్యంలో భాగంగా వైద్యులకు, నర్సులకు ఇన్సెంటివ్ ఇవ్వబోతున్నట్లు మంత్రి తెలిపారు. బాగా పని చేసే వారికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపు ఉంటుందనీ, ఈ నెల ఏడున వారిని సన్మానించనున్నట్టు చెప్పారు. ఇక నుంచి ప్రతి నెల సమీక్ష ఉంటుందనీ, పురోగతి రిపోర్టులతో సిద్దంగా ఉండాలని సూచించారు. అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. మందుల కోసం బయటికి రాస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాము కాటు, కుక్క కాటు మందులు తప్పకుండా పీహెచ్‌సీల్లో ఉండాలనీ, వైద్యం అందలేదని ఫిర్యాదులు వస్తే బాధ్యులుగా చేస్తూ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విధుల్లో ఉంటూ వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
పాత పీహెచ్‌సీల స్థానంలో అవసరమైతే కొత్త నిర్మాణాలు చేస్తామనీ, పెద్ద మొత్తంలో మరమ్మతులు ఉన్న పీహెచ్‌సీల్లో వెంటనే రిపేర్లు మొదలు పెడతామని మంత్రి అన్నారు. దీనికి అవసరమైన నిధులను విడుదల చేస్తామని చెప్పారు. డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, ఇంజినీర్లు పరిశీలించి వారం రోజుల్లో ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఈ టెలి కాన్ఫరెన్స్‌లో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ జి.శ్రీనివాస రావు, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజరు కుమార్, డీఎంఇ డాక్టర్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.