Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌పై రేవంత్ ఆగ్రహం
- బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ క్రీడ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బాయిల్డ్ రైస్ ఇవ్వబోమంటూ కేంద్రంతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారనీ, అలా సీఎం చేసిన సంతకం రైతుల పాలిట మరణ శాసనంగా మారిందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి పండించిన పంటను కొనే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోడీచెప్పలేదా? అని నిలదీశారు. వరి కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ క్రీడ ఆడుతున్నాయని విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో పార్టీ నేతలతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేయకుండా ఈ రెండు పక్షాలు నాటకాలాడుతున్నాయని విమర్శించారు. మిల్లర్లతో కేసీఆర్ కుటుంబం కుమ్మక్కు అయిందనీ, ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు మిల్లర్లకు అమ్ముతున్నారని ఆరోపించారు. మిల్లర్లు చాలా తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.1,960కి కొనాల్సిన వడ్లను కేవలం రూ.1400కే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. కేంద్రం మద్దతు ధరను వరికి ప్రకటించిందా? లేక బియ్యానికి ప్రకటించిందా? చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం, రాష్ట్రం ఏం చేస్తాయో తెలియదు...వడ్లు మాత్రం కొనాల్సిందేనన్నారు.
మా పిల్లలను డ్రగ్స్ టెస్టుకు తీసుకొస్తా... మీ కుమారుడ్ని పంపుతావా?
పిల్లల్ని అడ్డం పెట్టుకొని తమపై రాజకీయమా? అంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మా పిల్లలందరికీ డ్రగ్స్ టెస్టులకు తీసుకొస్తా...మీ కుమారుడిని డ్రగ్స్ టెస్టుకు పంపుతావా?' అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 24 గంటల పబ్‌లకు అనుమతి ఇచ్చింది ఎవరని నిలదీశారు. 125 మందికి డ్రగ్స్ టెస్టు చేయకుండా ఎందుకు విడిచిపెట్టారని ప్రశ్నించారు. డ్రగ్స్‌ను అడ్డుపెట్టుకుని సినిమా రంగంపై సీఎం, మంత్రి కేటీఆర్ పట్టు సాధించారనీ, డ్రగ్స్ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
నిమ్స్ కాంట్రాక్టు నర్సుల సమస్యలను పరిష్కరించండి
పది రోజులుగా నిమ్స్ కాంట్రాక్టు నర్సులు ఆందోళన చేస్తున్నా...ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నర్సుల డిమాండ్లను హరీష్‌రావు పెడచెవిన పెట్టడం దుర్మార్గమని తెలిపారు. ఈమేరకు మంగళవారం మంత్రి హరీశ్‌రావుకు ఆయన లేఖ రాశారు. నిమ్స్ కాంట్రాక్ట్ నర్సులకు ప్రసూతి సెలవులు, వేతన పే స్లిప్పులు ఇవ్వకపోవడం అన్యాయమని గుర్తు చేశారు. ఇది కట్టు బానిసత్వం కిందకు వస్తుందని వివరించారు. హరీశ్‌రావు స్వయంగా వెళ్లివారితో చర్చలు జరపాలని పేర్కొన్నారు. నర్సుల కనీస డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు.