Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని వరి పంటను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఈనెల ఆరోతేదీన జాతీయ రహదారులు, 7న జిల్లా కేంద్రాల్లో చేయబోయే నిరసన కార్యక్రమాలను అడ్డుకోవాలని కోరుతూ కాకతీయ లారీ ఓనర్స్ అసోసియేషన్ అత్యవసర హౌస్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ రాధారాణి తన ఇంటి వద్ద నుంచి మంగళవారం సాయంత్రం విచారణ జరిపారు. రాస్తారోకో చేస్తే ప్రాణావసరమైన కూరగాయలు, పాలు వంటి వాటి రవాణా నిలిచిపోయే ప్రమాదం ఉందని పిటిషనర్ లాయర్ వాదించారు. చెన్నై, బెంగళూరు, కోల్కత్తా, ముంబాయి వంటి నగరాలకు వెళ్లే జాతీయ రహదారులపై వాహనాల్ని నిలిపివేస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. తక్షణమే రాస్తారోకో ఆపేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఏడోతేదీన జిల్లా కేంద్రాల్లో కూడా నిరసనలు తెలియజేయనుందన్నారు. రాజకీయ దురుద్ధేశంతో రిట్ వేశారనీ, మధ్యంతర ఉత్తర్వుల జారీ అవసరం లేదని ప్రభుత్వ లాయర్ వాదించారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. బుధవారం రెగ్యులర్ కోర్టులో తొలి కేసుగా విచారణ జరిగేలా చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.