Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమరశీల ఉద్యమాలతో సాధ్యం : మాజీ మంత్రి రవీందర్ నాయక్, కోదండరామ్
నవతెలంగాణ-మిర్యాలగూడ
రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 16 (4) ప్రకారం గిరిజన రిజర్వేషన్ల పెంపునకు ఎటువంటి రాజ్యాంగ సవరణ అక్కరలేదని గిరిజన సంక్షేమ శాఖ మాజీ మంత్రి, బంజారా గాంధీ ధరావత్ రవీందర్ నాయక్, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్, జాతీయ ఆదివాసి సంఘం ఉపాధ్యక్షులు, జాతీయ కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి తేజావత్ బెల్లయ్య నాయక్ అన్నారు.
బంజారా ఉద్యోగుల సంఘం, గిరిజన రిజర్వేషన్ పోరాటం సమితి ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షను వారు ప్రారంభించి మాట్లాడారు. జనాభా దామాషా ప్రకారం గిరిజన రిజర్వేషన్ పెంపునకు పార్లమెంటు, అసెంబ్లీ మంత్రిమండలి తీర్మానం అవసరం లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. రిజర్వేషన్ సాధన కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో ప్రకారం 50 శాతంలోపు రిజర్వేషన్లు, గిరిజనులకు 9.08 శాతం రిజర్వేషన్ అమలు పరచాలని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. ఎస్టీ రిజర్వేషన్ 10 శాతం అమలుకు లేని ఆటంకం గిరిజన రిజర్వేషన్ పెంపు విషయంలో ఎందుకని ప్రశ్నించారు. రిజర్వేషన్లు సాధించుకునేందుకు గిరిజనులు ఐక్య పోరాటాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. రిలే నిరాహార దీక్షలకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), మాల మహానాడు బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం, బీసీ సంఘం, తెలంగాణ గిరిజన సంఘం, డీివైఎఫ్‌ఐ, లంబాడి హక్కుల పోరాట సమితి, యూటీఎఫ్, పీఆర్టీయూ, ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలు సంఘీభావం తెలిపాయి. దీక్షలో గిరిజన రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, బంజారా ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు మాలోతు దశరథ నాయక్, బంజారా సంఘం నాయకులు సైదా నాయక్, మాన్య నాయక్, సర్పంచ్ రామచంద్రనాయక్, సిపాయి నాయక్, వజ్రగిరి అంజయ్య, బంజారా యూత్ అధ్యక్షులు మెగావత్ నాని నాయక్, దానావత్ క్రిష్ణ నాయక్ కుశ నాయక్, దేవీలాల్ నాయక్ కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు శంకర్‌నాయక్, బీజేపీ జిల్లా కార్యదర్శి రతన్ సింగ్ నాయక్, స్కైలాబ్ నాయక్, సామాజికవేత్త మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి ఎల్ ఆర్.వేణుగోపాల్ రెడ్డి, ధీరావత్ వినాయక్, రవి నాయక్, తాళ్లపల్లి రవి, బెజ్జం సాయి తదితరులు పాల్గొన్నారు.
రిజర్వేషన్ పౌరుల హక్కు
గిరిజన చైతన్య సదస్సులో కోదండరామ్
రిజర్వేషన్ అనేది పౌరుల హక్కు అని, ఇది ప్రభుత్వాలు పెట్టే బిక్ష కాదని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ మంత్రి రవీందర్ నాయక్ అన్నారు. స్థానిక పీవీఆర్ గార్డెన్లో గిరిజన చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్లే ఇప్పుడు అమలు అవుతున్నాయని చెప్పారు. విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని విమర్శించారు. రిజర్వేషన్ సాధన కోసం అన్ని సామాజికవర్గాలు ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.