Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాల దొంగాట ఆపాలి
- ధాన్యం తగులబెట్టి నిరసన తెలిపిన రైతులు
నవతెలంగాణ -నల్లగొండ
రైతు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దొంగాటలు ఆపి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హాషం డిమాండ్ చేశారు. మంగళవారం రైతులు నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ బైపాస్ ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర ధాన్యం తగలబెట్టి.. కట్టెలతో వంట చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులను మోసం చేస్తున్నాయన్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్తు, బస్ చార్జీలు పెంచి భారాలు మోపాయన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారాలు వేయడం సరికాదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. వెంటనే ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, పెట్రోల్ డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఎండి.సలీం, జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి, తుమ్మల పద్మ తదితరులు పాల్గొన్నారు.