Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీఆర్‌తో సమావేశంలో ఆర్మీ అధికారుల హామీ
- రోడ్ల మూసివేత, పెండింగ్ అంశాలపై చర్చ
- త్వరలోనే జాయింట్ ఇన్స్పెక్షన్
- హాజరైన దక్షిణ భారత మేజర్ జనరల్ అరుణ్
- ఆర్మీ అధికారులకు ధన్యవాదాలు : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో కంటోన్మెంట్ రోడ్ల మూసివేత, ఇతర కంటోన్మెంట్ ప్రాంత సంబంధిత అంశాలపై మంగళవారం పురపాలకశాఖ మంత్రి కేటీఆర్తోఆర్మీ ఉన్నతాధికారులు సమావేశమయ్యా రు. నానక్రాంగుడలోని హెచ్‌జీసీఎల్ కార్యాలయం లో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్ నగరంలో ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్ల మూసివేత అంశంపై ప్రధానంగా చర్చించారు. దీంతోపాటు మెహదీపట్నం కంటోన్మెంట్ ఏరియాకి సంబంధించిన వరద కాల్వ వంటి మరికొన్ని సమస్యలపై సైతం విస్తృతంగా చర్చించారు.
హైదరాబాద్ మహానగరంలో పెద్దఎత్తున మౌలిక వసతుల కల్పన చేస్తున్నామని, ఇందులో భాగంగా నగరంలోని అన్ని దిక్కుల భారీఎత్తున రోడ్ల నిర్మాణం, విస్తరణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఆర్మీ ప్రాంతాల్లో సైతం మౌలిక వసతుల కల్పన జరిగిందని కేటీఆర్ తెలిపారు. అయితే స్కైవేల నిర్మాణం విషయంలో కేంద్ర రక్షణశాఖ మంత్రులు, ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి, ప్రభుత్వం తరఫున అనేకసార్లు విజ్ఞప్తి చేసినా ఎలాంటి సానుకూల స్పందన రాలేదని ఆర్మీ అధికారులకు వివరించారు. దీంతోపాటు కంటోన్మెంట్ ప్రాంతంలో పదేపదే రోడ్లను మూసివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా కెేటీఆర్ ప్రస్తావించారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయకారిగా ఉంటామని ఈ సందర్భంగా ఆర్మీకి చెందిన దక్షిణభారత లెఫ్టినెంట్ జనరల్ అరుణ్, ఇతర ఉన్నతాధికారులు మంత్రి కేటీఆర్‌కి హామీ ఇచ్చారు. రోడ్ల మూసివేత అంశంపై ప్రధానంగా చర్చించి, త్వరలోనే ఆర్మీ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఉమ్మడి ఇన్స్పెక్షన్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. దీంతోపాటు మెహదీపట్నం ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో బల్కాపూర్ వరద నాల విస్తరణ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మెహదీపట్నం చౌరస్తాలో నిర్మించనున్న స్కైవాక్ పనులను కూడా పూర్తి చేసేందుకు సహకరిస్తామని ఆర్మీ అధికారులు తెలిపారు. గోల్కొండ గోల్ఫ్ కోర్స్, డాలర్‌హిల్స్ మీదుగా నెక్నామ్పూర్ వైపు లింకు రోడ్ల నిర్మాణానికీ సహకరిస్తామన్నారు.ప్రజల అభివృద్ధి కోసం చేపట్టే ఏ కార్యక్రమానికైనా తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సంస్థలతో కలిసి పని చేస్తామని ఈ సందర్భంగా మేజర్ జనరల్ అరుణ్ బృందం మంత్రి కేటీఆర్‌కి హామీ ఇచ్చింది. ఆర్మీకి సంబంధించిన ప్రతి విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత గౌరవప్రదమైన దృక్పథంతో ముందుకుపోతుందని, అమర వీరుడైన తెలంగాణవాసి సంతోష్‌బాబు నుంచి గాల్వన్ లోయ అమరవీరుల వరకు గౌరవించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచి మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆర్మీ జనరల్ మేనేజర్, ఆయన బృందానికి మంత్రి కేటీఆర్ శాలువాలు కప్పి మెమొంటోలను అందించారు. ఈ సమావేశంలో ఆర్మీ ఉన్నతాధికారులతో పాటు జీహెచ్ఎంసీ హెచ్ఎండీఏ అధికారులు, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.