Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్కు కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ నివేదిక
- మొత్తం ప్రసవాల్లో 90శాతం సిజేరియన్ కేసులే..
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాల్లో మళ్లీ కరీంనగర్ జిల్లా టాప్ ప్లేస్‌లో నిలవడం కలవర పెడుతోంది. 2019-2021 మధ్యన సాగిన ప్రసవాల్లో కరీంనగర్‌లోనే అత్యధికంగా 82.4శాతం శస్త్ర చికిత్సలు చేసినట్టుగా కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ తన నివేదికను రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్కు అందించింది. వారం కిందటే రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ జిల్లాలో పర్యటించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రయివేటులో సాధారణ ప్రసవాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని, మంచి రోజు, ముహూర్తం అని ప్రసవాలు చేయొద్దని హెచ్చరించారు.
వైద్యుల కొరత, డిప్యూటేషన్లు, ఇన్చార్జి బాధ్యతల నడుమ పీహెచ్సల్లో ప్రసవాలు తగ్గగా.. ఆ భారమంతా జిల్లా కేంద్రంలోని మతాశిశు కేంద్రంపైనే పడుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రయివేటును ఆశ్రయించి అటు కడుపు కోతకు, ఇటు ఆర్థిక భారానికి గురవుతున్నారు.
ప్రయివేటులోనే 95శాతం సిజేరియన్లు..
కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. 2021 సంవత్సరానికి సంబంధించిన ప్రసవాల సంఖ్య కరీంనగర్లో సిజేరియన్ల దందాకు అద్దం పడుతోంది. 2021లో జనవరి నుంచి ఆగస్టు వరకు మొత్తం 4510 ప్రసవాలు జరిగితే ఇందులో 3258 కేసులు శస్త్ర చికిత్స చేసి ప్రసవాలు చేశారు. మిగతా 1252 మందికి మాత్రం సాధారణ ప్రసవాలు చేశారు. మొత్తం ప్రసవాల సంఖ్యలో సీజేరియన్ల శాతం 72.23గా ఉంది. అదే ప్రయివేటు ఆస్పత్రుల్లో పరిశీలిస్తే.. అదే ఏడాది జనవరి నుంచి జులై వరకు 2784 మంది గర్భిణులు ప్రసవం అయితే, అందులో 2607 మందికి శస్త్ర చికిత్సలే చేశారు. 117 మందికి మాత్రమే సాధారణ ప్రసవం చేశారు. 94.64శాతం సిజేరియన్లే చేయడం గమనార్హం. అటు ప్రభుత్వ ఆస్పత్రులు, ఇటు ప్రయివేటు దవాఖాన్లను కలిపి పరిశీలిస్తే 2021 జనవరి నుంచి జులై నెలాఖరు వరకు జరిగిన మొత్తం 7294 ప్రసవాల్లో సీ-సెక్షన్ ప్రసూతులే 5865 అయ్యాయి. అంటే 80.40శాతంగా కనిపిస్తుండగా.. ఆ ఏడాది మొత్తం లెక్కలు తీసిన కౌన్సిల్ ఫర్ డెవలప్మెంట్ 84.4శాతం శస్త్ర చికిత్సలే జరిగినట్టు గుర్తించింది.
సర్కారు వైద్యులు.. సిబ్బంది కొరతా కారణమే..
పీహెచ్‌సీల్లోనే ప్రసవాలు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఎక్కడా అమలు కావడం లేదు.24గంటలు సేవలందించే పీహెచ్‌సీల్లో సగటు న నెలకు 20 డెలివరీలైనా చేయాల్సి ఉండగా.. రెండు మూడు కూడా కావడం లేదు. ఇందుకు డాక్టర్ల కొరత, ఉన్న వారు డిప్యూటేషన్‌పై వెళ్లడం, మరో పీహెచ్‌సీకి ఇన్చార్జి బాధ్యతలు వ్యవహరించడం కారణంగా ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ ప్రసవాలు చేసేందుకు స్టాఫ్ నర్సులు భయపడుతున్నారు. ఈ భారమంతా ఇప్పుడు జిల్లా కేంద్రంలోని మతాశిశు కేంద్రంపైనే పడుతోంది. ఈ భారాన్ని తగ్గించేందుకు మూడేండ్ల కిందటే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఫండ్స్ కేటాయించిన సర్కారు ఒక్కో పీహెచ్‌సీకి కనీసంగా రూ.లక్ష నుంచి రూ.2లక్షలు ఇచ్చింది. అయితే వైద్యులు, సిబ్బంది కొరత లక్ష్యాన్ని చేరనీయడం లేదు.
తగ్గినట్టే తగ్గి..
ప్రయివేటు ఆస్పత్రుల్లో చేసే సిజేరియన్ ఆపరేషన్లలో గతంలోనూ కరీంనగర్ దేశంలోనే మొదటి స్థానంలోనే ఉండేది. ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలో నార్మల్ డెలివరీల కంటే ప్రయివేటు ఆస్పత్రిలో జరిగే సిజేరియన్ ఆపరేషన్లు పదుల రెట్లలో ఎక్కువగా ఉండేవి. అప్పట్లోనే ఇంత పెద్దఎత్తున జరుగుతున్న ఆపరేషన్లపైనా, ప్రయివేటు దందాపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందంటూ ప్రజా సంఘాలు, ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ చర్యలకు ఉపక్రమించడంతో క్రమక్రమంగా ప్రయివేటు ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్లు తగ్గాయి. కానీ తాజా నివేదికలో కరీంనగర్లో అధికారులు అలర్టు అయ్యారు. దీన్ని ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది.
బాక్స్ఐటెం
రూ.45 నుంచి రూ.70వేల ఖర్చు
తల్లిని కాబోతున్నామన్న ఆనందంతో పురిటి నొప్పులతో ప్రయివేటు ఆస్పత్రికి వస్తే ఆర్థిక భారం మరింత కుంగదీస్తోంది. ఆపరేషన్లను బట్టి పండంటి బిడ్డతో ఇంటికి వెళ్లే ముందు రూ.50వేల నుంచి రూ.70వేల వరకు (అన్ని ఖర్చులూ కలుపుకుని) అప్పులు చేసి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. శుభ ఘడియల పేరుతోనూ సర్జరీలు చేయించుకుంటున్న ఘటనలూ ఉన్నాయి. రోజులు నిండకున్నా మంచి ముహూర్తం, అశుభ గడియలు వస్తున్నాయని కొందరు డాక్టర్లే ఒప్పిస్తున్నారన్న అపవాదూ ఉంది.