Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ కబంధ హస్తాల్లో ఇంటర్ బోర్డు
- ఆర్టీఐకి విద్యాశాఖ సమాధానంతో వాస్తవాలు బట్టబయలు
- చోద్యం చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కార్పొరేట్, ప్రయివేటు జూనియర్ కాలేజీలు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. పలు అకాడమీలు, కాలేజీలకు అనుబంధంగా ఉన్న హాస్టళ్లకు అనుమతుల్లేకుండానే నిర్వహిస్తున్నాయి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)కి ఇంటర్ బోర్డు సమాధానం ఇవ్వడంతో ఈ వాస్తవాలు బట్టబయలయ్యాయి. జూనియర్ కాలేజీలకే అనుబంధ గుర్తింపు ఇస్తామనీ, అకాడమీలు, హాస్టళ్లకు అనుమతి ఇవ్వలేదంటూ ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. దీంతో ఎలాంటి అనుమతి లేకుండానే అకాడమీలు, హాస్టళ్లను నిర్వహిస్తూ నిబంధనలకు యాజమాన్యాలు తిలోదకాలిస్తున్నాయి. కార్పొరేట్, ప్రయివేటు కాలేజీల కబంధ హస్తాల్లో ఇంటర్ బోర్డు ఉందనడానికి ఇదే నిదర్శనం. నిబంధనలకు ఆయా యాజమాన్యాలు తూట్లు పొడుస్తున్నాయి. అయినా ఇంటర్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తున్నాయి. వాటిపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. దీంతో కార్పొరేట్, ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలతో ఇంటర్ బోర్డు అధికారులు, ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కయ్యారన్న అనుమానాలకు తావిస్తున్నది. ఏటా ఆయా యాజమాన్యాలు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు అమ్ముడుపోయారన్న ఆరోపణలు విద్యార్థి, యువజన సంఘాల నుంచి వస్తున్నాయి. నిబంధనలు పాటించని కాలేజీల అనుబంధ గుర్తింపును రద్దు చేయాలనీ, అనుమతి తీసుకోకుండా నిర్వహిస్తున్న అకాడమీలు, హాస్టళ్లపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
ఇంటర్ బోర్డుకు నియంత్రించే అధికారముందా?
రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రయివేటు కాలేజీలకు అనుబంధంగా ఉండే హాస్టళ్లు, అకాడమీలను నియంత్రించే అధికారం ఇంటర్ బోర్డుకు ఉందా? అన్న ప్రశ్న తలెత్తుతున్నది. 2018-19 విద్యాసంవత్సరం నుంచి జూనియర్ కాలేజీలకు అనుబంధంగా ఉండే హాస్టళ్ల నిర్వహణకు తప్పనిసరిగా అనుమతి పొందాలని ఇంటర్ బోర్డు ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 600 వరకు కార్పొరేట్ కాలేజీలుంటే అందులో 13 మాత్రమే హాస్టళ్ల కోసం ఆ విద్యాసంవత్సరంలో దరఖాస్తు చేసుకున్నాయి. మిగతా 587 కాలేజీలు దరఖాస్తు చేసుకునేందుకే ముందుకు రాలేదు. హాస్టళ్ల నిర్వహణకు అనుమతి ఇచ్చే అధికారం ఇంటర్ బోర్డుకు లేదని కాలేజీ యాజమాన్యాలు చెప్తున్నాయి. అంటే హాస్టళ్లు ఇష్టారాజ్యంగా నిర్వహించుకోవచ్చనీ, నిబంధనలు పాటించనవసరం లేదంటూ భావిస్తున్నాయి. ఇంకోవైపు కార్పొరేట్, ప్రయివేటు కాలేజీలకు అనుబంధంగా ఉండే హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పన అంత డొల్లగా ఉందంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదుగురు ఉండే గదుల్లో 12 మంది వరకు విద్యార్థులను ఉంచుతున్నారు. టాయిలెట్లు, వాష్‌రూమ్‌లు సరిపోయినన్ని లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్ బోర్డు అధికారుల ఆకస్మిక తనిఖీల్లోనే ఈ విషయాలు బయటపడ్డాయి. అయినా అధికారులుచర్యలు తీసుకోలేకపోతున్నారు. దీన్ని బట్టి అవినీతి తీవ్ర స్థాయిలో జరుగుతున్నదంటూ విద్యార్థి సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
1,564 ప్రయివేటు జూనియర్ కాలేజీలకు గుర్తింపు
రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరంలో 1,574 ప్రయివేటు జూనియర్ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో 1,564 కాలేజీలకు గుర్తింపు ఉందంటూ ఇంటర్ బోర్డు ప్రకటించింది. మిగతా పది కాలేజీలకు గుర్తింపు ప్రకటించలేదు. 2019-20 విద్యాసంవత్సరంలో 1,622 ప్రయివేటు కాలేజీలు దరఖాస్తు చేసుకుంటే 1,534 కాలేజీలకు, 2020-21 విద్యాసంవత్సరంలో 1,588 కాలేజీలు దరఖాస్తు చేస్తే, 1,584 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చామని ఇంటర్ బోర్డు అధికారులు వివరించారు. నిబంధనల ప్రకారం శానిటరీ, ఫైర్‌సేఫ్టీ, హైదరాబాద్‌లో అయితే జీహెచ్ఎంసీ నిరభ్యంతర సర్టిఫికెట్, వైద్యఆరోగ్య శాఖ అధికారి సర్టిఫికెట్ తప్పనిసరిగా అవసరం. కాలేజీల భవనాలు, తరగతి గదులు, అర్హులైన అధ్యాపకులు, ఆటస్థలం ఉండాలి. ప్రయివేటు వ్యక్తుల భవనమైతే దానికి రిజిస్టర్డ్ లీజ్ డీడ్ తప్పనిసరిగా కావాలి. ఎఫ్డీఆర్, కాషన్ మనీ డిపాజిట్ చేయాలి. స్ట్రక్చరల్ సౌండ్‌నెస్ సర్టిఫికెట్ కావాలి. భవనం ఎత్తు 15 మీటర్ల కంటే ఎక్కువ ఉంటే ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు ఫైర్ సర్వీసెస్ శాఖ నుంచి తేవాలి. 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న కాలేజీలు 63 ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వం దానికి మినహాయింపు ఇచ్చింది. అందుకే అన్ని కాలేజీలకూ ఇంటర్ బోర్డు గుర్తింపు ప్రకటించింది.
కార్పొరేట్ దళారీల చేతిలో ఇంటర్ బోర్డు కీలుబొమ్మ : ఎం రామకృష్ణగౌడ్, టిగ్లా ప్రధాన కార్యదర్శి
రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీ దళారీల చేతిలో ఇంటర్ బోర్డు కీలుబొమ్మగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా,అనుమతుల్లేకున్నా లక్షల మంది విద్యార్థు లు హాస్టళ్లలో ఉంటున్నారు.అయినా రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి, అధికారులు చోద్యం చూస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుం డా ఉన్న అకాడమీలు, హాస్టళ్లపై కొరఢా ఝుళిపించాలి. కఠిన చర్యలు తీసుకో వాలి.అవసరమైతే ఆయా కాలేజీల అనుబంధ గుర్తింపును రద్దు చేయాలి. కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్లు,ఓడీలు, ఓఎస్డీ లుగా ఉంటూ కార్పొరేట్ విద్యాసంస్థలకు కోటరీగా మారి విద్యార్థుల భవిష్య త్తులో చెలగాటమాడుతున్నారు.