Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నష్టాల సాకుతో మూసివేతకు కుట్ర
- పనులు పూర్తైనా ప్రారంభం కాని కోస్గి డిపో
- ఇతర ప్రాంతాలకు బస్సుల తరలింపు
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఆర్టీసీ డిపోలపై కారుమబ్బులు కమ్ముకున్నాయి. పిచ్చిదనే పేరుతో కుక్కను చంపినట్టుగా నష్టాల పేరు చెప్పి డిపోలను మూసేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. ఆదుకుంటామంటూనే.. నష్టాల నుంచి ఎలాగోలా గట్టెక్కించే ప్రయత్నం చేయకపోగా నిర్మించిన వాటిని కూడా ప్రారంభించడం లేదు. ఆర్టీసీ ఆస్తులను విక్రయించి సొమ్ము చేసుకునేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఆర్టీసీ బస్సులను ఇతర డిపోలకు తరలించడం ఆర్టీసీ నిర్వీర్యానికి నిదర్శనం.
2018లో రవాణా శాఖామంత్రి మహేందర్‌రెడ్డి, నీటిపారుదల శాఖామంత్రి హరీశ్‌రావు కోస్గి డిపోకు భూమి పూజ చేశారు. అంతకు ముందు 2014లో రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి నాలుగున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఆర్టీసీ డిపో కోసం ప్రభుత్వానికి అప్పగించారు. డిపో నిర్మాణం కోసం అప్పటి ఎంపీ సీఎం రమేష్ రూ.2 కోట్లు కేటాయించారు. పనుల జాప్యం వల్ల ఆ నిధులు ఖర్చు కాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.3 కోట్లతో పనులు మొదలు పెట్టింది. మరో కోటితో బస్టాండ్ నిర్మాణం చేశారు. పనులు దాదాపు పూర్తయ్యాయి. అయినా.. ప్రారంభానికి నోచుకోలేదు. మరోవైపు నష్టాల సాకులో ఇతర డిపోలను మూసేసేందుకు సిద్ధమవు తుండగా.. కోస్గి డిపో ప్రారంభం కాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 9 ఆర్టీసీ డిపోలున్నాయి. వీటి పరిధిలో 860 బస్సులు నడుస్తున్నాయి. ఇప్పటివరకు సంక్షేమరంగంగా ఉన్న ఆర్టీసీని ప్రస్తుతం కమర్శియల్‌గా మార్చారు. నష్టాల పేరుతో కల్వకుర్తి, అచ్చంపేట డిపోల నుంచి పదుల సంఖ్యలో బస్సులను ఇతర ప్రాంతాలకు తరలించారు. 9 డిపోల పరిధిలో 50 బస్సులకు పైగా లాభాలు వచ్చే డిపోలకు తరలించినట్టు సమాచారం. బస్సులను తరలించడమే కాదు..అవసరమైతే డిపోలనే మూసే ఆలోచన ఉందని అధికారులు చెబుతున్నారు. కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ డిపోలు నష్టాల బాటలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. నష్టాలు ఎందుకొస్తున్నాయన్న దానిపై వారి వద్ద సమాధానం లేదు. డిపోలను ఆర్టీసీ గ్యారేజికి వాడుకుంటామని చెబుతున్నా అందులో వాస్తవాలు లేవు. క్రమంగా వీటిని అమ్మేసి సొమ్ము చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తులను అమ్మితే ఊరుకోబోమని హెచ్చరించాయి.
బస్సుల తరలింపు అంతర్గత వ్యవహారం
బస్సులను ఇతర డిపోలకు తరలించడమనేది ఆర్టీసీలో అంతర్గత వ్యవహారం. ఇది రెగ్యూలర్‌గా కొనసాగేదే. ఇక కోస్గి డిపో నిర్మాణ పనులు పూర్తి కాలేదు. అందుకే ప్రారంభం చేయలేదు. ప్రతి రోజూ రూ.1.10 కోట్ల ఆదాయం వచ్చే వచ్చే ఆర్టీసీ డిపోలను ఎందుకు కుదిస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి అలాంటి ఆలచోచనేమీ లేదు. ఇంకా మెరుగైన వసతులతో ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.
- శ్రీధర్- ఆర్ఎం- మహబూబ్‌నగర్