Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 300 కోట్లతో విప్రో పెట్టుబడి
- స్థానికులకు 90శాతం ఉద్యోగాలు : కేటీఆర్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి/మర్కుక్
రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండి ఎలాంటి సమస్యలు తలెత్తకపోవడం, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు తమ సహాయ సహకారాలు అందించడం ద్వారానే పెట్టుబడిదారులు మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో పారిశ్రామిక రంగంలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉందని తెలిపారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని విప్రో జనరల్ పార్క్ కె.సీ తండాలో ఏర్పాటు చేసిన విప్రో కన్జుమర్ కేర్ ఫ్యాక్టరీని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. విప్రో కంపెనీ ఈ ప్రాంతంలో రూ. 300 కోట్ల పెట్టుబడితో స్థాపించి, కంపెనీలో 900 మందికి ఉపాధి కల్పించిందన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఎస్ ఐపాస్ ద్వారా 15రోజుల్లో అనుమతులు ఇచ్చి 2లక్షల 20 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్టు తెలిపారు. 16 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించినట్టు వివరించారు. విప్రో లాంటి పెద్ద కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నప్పుడు వాటికి రాయితీలు కల్పిస్తూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. విప్రో కంపెనీ చైర్మెన్ అజీమ్ ప్రేమ్ జీ వినూత్నమైన వ్యాపారవేత్త అని, అంతే కాకుండా రూ. 25 కోట్ల హెల్త్ కేర్ కోసం, కరోనా సమయంలో రూ. 12 కోట్లు కోవిడ్ వ్యాక్సిన్ కోసం రూ. 44కోట్లు స్వచ్ఛంద సేవా సంస్థలకు నేరుగా అందించినట్టు తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో విప్రో కంపెనీ స్థాపించడం వల్ల ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయాయని అన్నారు. కంపెనీలో 90 శాతం స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ అనితాహరినాథ్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఇండిస్టీస్ కామర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జయేష్ రంజన్, పరిశ్రమల ఎం.డీ నరసింహారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోరు కుమార్, విప్రో కంపెనీ చైర్మెన్ ఫౌండర్ అజీమ్ ప్రేమ్ జీ, కంపెనీ సీఈఓ వినీత్ అగర్వాల్, ఆర్డీవో వెంకటాచారి, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
పారిశ్రామిక రంగంలో తెలంగాణ ఫస్ట్
పారిశ్రామిక రంగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కర్కపట్ల గ్రామ పరిధిలో జాంప్ ప్రయివేటు ఫార్మా కంపెనీ లిమిటెడ్ను ఆ కంపనీ చైర్మెన్ లూయిస్ ఫిలాన్తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నదన్నారు. రోడ్లు, నీటి లాంటి సమస్యల్లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్థానిక సర్పంచ్ గాజె నర్సింలు, ఎంపీపీ పాండుగౌడ్, జడ్పీటీసీ యెంబరి మంగమ్మ రాంచంద్రం యాదవ్, ఎంపీటీసీ కృష్ణయాదవ్, ఉపసర్పంచ్ అప్సర్, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.