Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెంచిన చార్జీలు వెనక్కి తీసుకునేదాకా పోరాటాలు
- జూమ్ సమావేశంలో రేవంత్ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రజలు విశ్వసించేలా కార్యక్రమాలు నిర్వహించాలనీ, పెంచిన చార్జీలు వెనక్కి తీసుకునేదాకా ప్రజాపోరాటాలు చేయాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేయాలంటూ పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశనిర్దేశం చేశారు. బుధవారం జూమ్ సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్లతో పాటు టీపీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేందుకు క్యాడర్ సిద్ధం కావాలని కోరారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, విద్యుత్తు ఛార్జీలు తగ్గే వరకు, రైతులు పండించిన పంటలు చివరి గింజ కొనేవరకు పోరాటాలు కొనసాగుతాయని వివరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీసీసీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలను విజయవంతంగా జరిగాయన్నారు. రైతులకు భరోసా కల్పించేలా, ప్రతి వరిగింజ కొనేవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల వైఖరిపై ఉద్యమాలు చేయాలన్నారు. కేంద్రం, రాష్ట్రం ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులకు తీవ్ర నష్టం చేసే పరిస్థితులు కలిగిస్తున్నారని చెప్పారు. ముడిబియ్యం, ఉప్పుడు బియ్యమంటూ ఒకరిపైన ఒకరు ప్రకటనలు చేసుకుంటూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.
నేడు విద్యుత్ సౌధ, పౌరసరఫరాల ఆఫీస్ ముట్టడి
విద్యుత్ సౌధ, పౌరసరఫరా కార్యాలయాల ముట్టడి పెద్ద ఎత్తున జరగాలని రేవంత్ సూచించారు. టీఆర్ఎస్ తమ ఉద్యమాలను అడ్డుకునే కుట్ర చేస్తున్నదని చెప్పారు. ఎక్కడ అడ్డుకుంటే అక్కడే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాలనీ, పోలిస్స్టేషన్లలో కూడా ఉద్యమం కొనసాగాలని స్పష్టం చేశారు. భవిష్యతు కార్యాచరణ కార్యక్రమాలపై నాయకులతో చర్చించి ప్రకటిస్తామని వెల్లడించారు.
వరంగల్ సభకు రాహుల్
ఈ నెలాఖరున ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్‌లో జరిగే సమావేశానికి ఆహ్వానించామన్నారు.