Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధనకు ఐక్యఉద్యమం : వక్తలు
- సీపీఐ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిరసన దీక్ష
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విభజన హామీల అమల్లో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విఫలమైందని పలువురు వక్తలు విమర్శించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమను సాధించుకోవడానికి ఐక్యఉద్యమం నిర్మించాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్రం పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. 'బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలు' విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బుధవారం 'నిరసన దీక్ష' నిర్వహించారు. అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ విభజన హామీల అమలు, బయ్యారం ఉక్కు పరిశ్రమను సాధించేందుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు సమరశీల పోరాటం నిర్మిస్తామని చెప్పారు. మోడీ ప్రభుత్వం మొదటి నుంచీ తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తోందన్నారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను, సీలేరు పవర్ ప్రాజెక్ట్‌ను ఏపీలో విలీనం చేసిందని విమర్శించారు. బయ్యారం ఉక్కును సాధించేందుకు కలిసొచ్చే రాజకీయ పార్టీలతో ప్రజాఉద్యమాన్ని నిర్మిస్తామన్నారు. ఎనిమిదేండ్ల కాలంలో విభజన హామీల అమలుకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలపైన మోడీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. ఈ రాష్ట్రాలతో ప్రధాని మోడీకి సంబంధం లేదా?అని ప్రశ్నించారు. తెలంగాణకు మెడికల్ కాలేజీలు, ఐఐటీ, ఐఐఎం, త్రిపుల్‌ఐటీ, గిరిజన, మైనింగ్ యూనివర్సీటీలనూ కేంద్రం ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తుందంటూ సీఎం కేసీఆర్ చెప్పారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా గుర్తు చేశారు.
టీజేఎస్ అధినేత ఎం కోడందరామ్ మాట్లాడుతూ బయ్యారం ఉక్కు పరిశ్రమతోపాటు విభజన హామీలు, పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంటు ధరలపైనా ప్రజాస్వామిక శక్తులన్నీ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై సీఎం కేసీఆర్ పోరాటం చేసేందుకు ముందుకు రాబోరనీ, ఆయన కుర్చీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారని విమర్శించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థల సేకరణలో ఆలస్యం జరిగిందన్నారు. గిరిజన విశ్వవిద్యాలయానికి స్థలమివ్వని పరిస్థితి నెలకొందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ తన బాధ్యతలను విస్మరించిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ, భాగం హేమంత్‌రావు, విఎస్ బోస్, బాలనర్సింహ, బాలమల్లేష్, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నాయకులు ప్రవీణ్‌కుమార్, టీడీపీ నాయకులు పి సాయిబాబా, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటి నర్సింహ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్ధిపేట, నల్లగొండ జిల్లాల కార్యదర్శులు పోటు ప్రసాద్, సాబీర్‌పాషా, విజయసారధి, పాలమాకుల జంగయ్య, డిజి సాయిలు, మందా పవన్, నెలికంటి సత్యం తదిరులు పాల్గొన్నారు.
అనంతరం మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో విభజన హామీల సాధనకు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ప్రకటించారు. వచ్చేనెల రెండోవారంలో కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తామనీ, వినతిపత్రాలు సమర్పిస్తామని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.