Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మికుల ఐక్యత కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు, కార్మికోద్యమ నేత బీటీరణదివే అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రాజారావు అన్నారు. బుధవారం హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో బీటీఆర్ 32వ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి రాజారావు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ..1948లో భారత కమ్యూనిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారనీ, శ్రామిక మహిళలు పని ప్రదేశాలలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని కొనియాడారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. దళిత, గిరిజన తదితర వెనుకబడిన సామాజిక తరగతుల్లోని కార్మికవర్గం ఎదుర్కొంటున్న వివక్షత, వేతనాల్లో వ్యత్యాసం, ప్రమోషన్లలో తారతమ్యాలు, నివాస ప్రాంతాల్లో వారు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలన్నింటిపైనా ప్రత్యేక పోరాటాలు చేశారని గుర్తుచేశారు. ఆయన చూపిన మార్గంలో నడవాలనీ, ఆశయసాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు మాట్లాడుతూ.. భారత కార్మికోద్యమానికి బీటీఆర్ దిశానిర్దేశం చేశారన్నారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన వదిలి వెళ్ళిన ఆశయాలు ఇంకా అలానే ఉన్నాయన్నారు. మహనీయుల త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలు, హక్కులు నేటి పాలకుల విధానాల వల్ల కాలరాయబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క కార్పొరేట్ల ఆస్తులు ఇబ్బడిముబ్బడిగా పోగుబడుతుంటే, మరోపక్క ఆకలి, పేదరికం, ఆకలి చావులు, రైతాంగ ఆత్మహత్యలు, నిరుద్యోగం రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విశాల ఐక్య కార్మికోద్యమాన్ని నిర్మించడమే బిటిఆర్కి అర్పించే నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, కూరపాటి రమేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యర్రగాని కృష్ణయ్య, కె. రాజయ్య, ఎ. సునీత, నాయకులు దూలం శ్రీనివాస్, వేల్పుల కుమారి, విజయలక్ష్మి, వేణు, నాగభూషణం, శ్యామ్, భారతి తదితరులు పాల్గొన్నారు.