Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి
- ఎంబీ భవన్లో సీపీఐ(ఎం) జెండావిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మిక, కర్షక నాయకత్వాన జనతా ప్రజాతంత్ర సంఘటన సాధించడమే లక్ష్యంగా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్టు సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి చెప్పారు. కేరళ రాష్ట్రంలోని కన్నూర్‌లో జరుగుతున్న సీపీఐ(ఎం) 23వ జాతీయ మహాసభను పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్‌లోని ఎంబీభవన్‌లో అరుణపతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో విప్లవ సాధనకు తీసుకున్న ఎత్తుగడలు, వాటిఫలితాలు, భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ నిర్మాణం, తదితర అంశాలన్నీ కన్నూరు మహాసభలో చర్చకు రానున్నాయని తెలిపారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తూనే ఉన్నాయనీ, దీంతో పేదలు మరింత పేదలుగా, ధనికులు మరింత ధనికులుగా మారుతున్నారని చెప్పారు. కరోనా కాలంలో కూడా కార్పొరేట్ సంస్థలు బాగా లాభాలు సంపాదించాయని తెలిపారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.సాగర్ మాట్లాడుతూ..ఈ కాలంలో దేశంలో కార్పొరేట్ శక్తులు, మతోన్మాదులు కుమ్మక్కయ్యారని విమర్శించారు. కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు రోజురోజుకు విపరీతంగా పెంచి ప్రజలపై భారాలు మోపుతున్న తీరును వివరించారు. మూడు వ్యవసాయ చట్టాల విషయంలో మోడీ సర్కారు ఒంటెద్దు పోకడలను తిప్పికొట్టిన ఘనత దేశ రైతాంగానికి దక్కుతుందన్నారు. రాష్ట్రంలో జరిగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరు, కేరళలోని వున్నప్రవాయిలార్, పశ్చిమబెంగాల్లో జరిగిన తెబాగా, మహారాష్ట్రలో జరిగిన వర్లీ ఆదివాసీల పోరాటాలు చరిత్ర సృష్టించిన విషయాన్ని గుర్తుచేశారు. వాటన్నింటినీ సమీక్షించి రాబోయే కాలంలో మతోన్మాదానికి, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా విశాలమైన ఐక్య ఉద్యమాలతో పాటు, వామపక్షాల ఐక్య ఉద్యమాలు నిర్మించే దిశగా ముందుకు సాగుతామని చెప్పారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి సమరశీల పోరాటాలకు మహాసభ నిర్ణయాలు దిక్సూచిగా నిలబడబోతున్నా యన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జె.బాబూరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అరిబండి ప్రసాదరావు, బి.ప్రసాద్, కోట రమేష్, శోభన్ నాయక్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.