Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీటీ రణదివె 32వ వర్ధంతి సభలో.. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవ తెలంగాణ-సిద్దిపేట అర్బన్
ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక రుగ్మతలపై, సామాజిక సమస్యలపై పోరాటాలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. బుధవారం బీటీ రణదివె 32వ వర్ధంతి సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో 'ప్రభుత్వ విధానాలు -సామాజిక న్యాయం- కార్మిక సంఘాల కర్తవ్యం' అంశంపై సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సంధబోయిన ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన సదస్సుకు చుక్క రాములు హాజరై మాట్లాడారు. పెట్టుబడిదారీవర్గం కులం, మతం పేరుతో కార్మిక వర్గాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తున్నాయని తెలిపారు. దీనికి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయన్నారు. 99 శాతం ఉన్న కార్మిక వర్గం శ్రమించి సంపదను సృష్టిస్తుంటే.. కేవలం ఒక్కశాతం ఉన్న కార్పొరేట్ శక్తులు ప్రజా, కార్మికవర్గం సంపదను దోచుకుంటున్నాయని విమర్శించారు. దోపిడీదారుల కుట్రలను భగం చేయడానికి కార్మికులు ఐక్యం కాకుండా విచ్ఛిన్నకర సామాజిక అంశాలను ముందుకు తీసుకొస్తున్నా రన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని తెలిపారు. అందుకే కార్మికులు కేవలం ఆర్థిక పోరాటాలకే పరిమితం కాకుండా సామాజిక అంశాలపైనా పోరాటాలు చేయాలన్నారు.
ట్రేడ్ యూనియన్ స్థాపకుల్లో ఒకరైన బీటీ రణదివె సీఐటీయూ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షునిగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలపై పోరాటాలు చేశారన్నారు. మరోవైపు కులం, మతం, ప్రాంత, భాష, లింగ వివక్షతపై పోరాటాలు నిర్వహించారని గుర్తుచేశారు. ఆర్థిక, సామాజిక అంశాలపై కలిసికట్టుగా పోరాడాలన్నారు. సదస్సులో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాముని గోపాలస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు ఎం పద్మ, చొప్పరి రవి కుమార్, సహాయ కార్యదర్శులు జి భాస్కర్, బండ్ల స్వామి, జిల్లా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.