Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నా
- ఇంధన ధరలు, చార్జీలు తగ్గించాలని డిమాండ్
- అధికారులకు వినతిపత్రాలు అందజేత
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలని నిరసిస్తూ.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, కరెంట్, విద్యుత్ చార్జీలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం కలెక్టరేట్ల ఎదుట ఆ పార్టీ శ్రేణులు ధర్నా చేశారు. వెంటనే ధరలను, చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తక్షణం వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు.
రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నాలో నాయకులు కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి మాట్లాడారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ మియాపూర్ ఎక్స్ రోడ్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు దగ్గర ధర్నా చేశారు. వికారాబాద్ కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి ప్రసాద్, నాయకులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే తాజాగా వంట గ్యాస్ ధరను పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షులు ఓబెదుల్లా కోత్వాల్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా అనంతరం కలెక్టర్ పి.ఉదరుకుమార్కు వినతిపత్రం అందజేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి జిల్లెల చిన్నారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా అనంతరం కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషకు వినతిపత్రం అందజేశారు.
హన్మకొండ జిల్లా ఏకశిలాపార్కు నుంచి కలెక్టరేట్ వరకు డీసీసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టి ధర్నా నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
నిజామాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ పాల్గొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్షలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఎడ్లబండిపై వచ్చి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా నిర్వహించారు. కొత్తగూడెం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
వేములవాడ సిరిసిల్ల ప్రధాన రహదారిపై రాస్తారోకో
నిత్యావసర ధరలు తగ్గించాలని, రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందించడానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ తోపులాటలో జిల్లా కాంగ్రె స్ పార్టీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ కాలుకి గాయాలు అయ్యాయి. ఆగ్రహంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైటాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ ఆందోళన వద్దకు చేరుకుని వినతిపత్రాన్ని తీసుకొని వారికి నచ్చజెప్పారు.