Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదేరోజు ఫలితాల వెల్లడి
- 1.25 లక్షల మందికి మెరిట్ ప్రకారమే శిక్షణ
- మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న 80,039 ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్లకు రూ. 50 కోట్ల వ్యయంతో, 119 నియోజకవర్గాల్లో 1.25 లక్షల మందికి ఉచిత కోచింగ్ నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారంనాడిక్కడి దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశంతో కలిసి విలేఖరులతో మాట్లాడారు. టీఎస్సీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1,2,3,4 తో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియామకం చేసే కానిస్టేబుళ్లు, ఎస్సై సహా వివిద రకాల ఇతర ఉద్యోగాలకు పోస్టుల వారీగా కోచింగ్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. బీసీ సంక్షేమ శాఖ రాష్ట్రంలో నిర్వహిస్తున్న 11 స్టడీసర్కిళ్లతో పాటు మరో ఐదు స్టడీ సర్కిళ్లు సిరిసిల్ల, సూర్యాపేట, వనపర్తి, నర్సంపేట్, జగిత్యాలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున రీడింగ్ రూమ్, ఆన్లైన్ క్లాస్ రూం, ప్యాకల్టీతో కూడిన డౌట్ క్లియరెన్స్ రూములతో కూడిన 103 స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఉచితంగా మౌలిక వసతుల కల్పన, ఇతర ఏర్పాట్లు ఎవరైనా ప్రజా ప్రతినిధులు, ఎన్జీవోలు ఏర్పాటు చేస్తే అక్కడ సైతం బీసీ స్టడీ సెంటర్‌ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 16 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 25 వేల మందికి నేరుగా, మరో 50,000 వేల మందికి హైబ్రిడ్ మోడల్లో ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇస్తామని తెలిపారు. అభ్యర్థుల సెలక్షన్ కోసం ప్రవేశపరీక్షలు అన్ అకాడమీ సహకారంతో నిర్వహిస్తామన్నారు. బీసీ సంక్షేమ శాఖ అందించే కోచింగ్లోబీసీలకు 75 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం, ఈబీసీలకు 5 శాతం, మరో ఐదు శాతం మైనారిటీలకు రిజర్వేషన్లు కేటాయించినట్టు చెప్పారు.
16న ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్
ఆన్ అకాడమీ ద్వారా నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్‌కు బుధవారం నుంచే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు ఆన్లైన్ పరీక్ష జరుగుతుందనీ, ఆరోజు ఉదయం 10 గంటల వరకు ఈ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామన్నారు.
కోచింగ్...స్టైఫండ్...
ఆన్లైన్ పరీక్ష అభ్యర్థుల సామర్థ్యంతో పాటు వారికి ఏ ఉద్యోగం కోసం కోచింగ్ ఇవ్వాలో నిర్దారించే విధంగా ఉంటుంది. మొదటగా నిలిచిన 5 శాతం మందికి గ్రూప్ 1 కోసం సెలక్ట్ చేస్తారు. వీరికి స్టడీ మెటీరియల్‌తో పాటు ఆరు నెలల పాటు నెలకు రూ.5వేలు చొప్పున స్టైఫండ్ ఇస్తారు. గ్రూప్-2 రాసే 10వేల మంది అభ్యర్థులకు మూడు నెలల పాటు నెలకు రూ.2 వేలు, ఎస్ఐ అభ్యర్థులకు నెలకు రూ.2 వేలు చొప్పున స్టైఫండ్ ఇస్తామని మంత్రి గంగుల కమలాకర్ వివరించారు.
రిజిస్ట్రేషన్ ఇలా...
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ https://studycircle.cgg.gov.in , జ్యోతిబాపూలే గురుకుల వెబ్సైట్ https://mjpabcwreis.cgg.gov.in , బీసీ సంక్షేమ శాఖ వెబ్ సైట్, ఇతర ప్రభుత్వ వెబ్సైట్లతో పాటు అన్ అకాడమీ వెబ్ సైట్ https://unacademy.com/scholarship/tsgovt-scholarship-test లోనూ అన్ లాక్ కోడ్ UNACADEMY10 ద్వారా నమోదు చేసుకోవచ్చు.
పరీక్ష...ఫలితాలు...
రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఈనెల 16వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో పరీక్ష రాయాలి. డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌తోపాటు మొబైల్ ఫోన్ల ద్వారా కూడా పరీక్ష రాసే వీలుంటుంది. 90 నిమిషాలు జరిగే ప్రవేశపరీక్షలో సామర్థ్యం ప్రకారం ఐదు విభాగాలుంటాయి. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. నెగటివ్ మార్కులు ఉంటాయి. దీనివల్ల పరీక్షల్లో కాపీ కొట్టడం, చూచి రాయడానికి వీలులేకుండా ప్రతి ప్రశ్నకు జవాబు రాసేందుకు నిర్ణీత సమయం ఉంటుంది. ఆలోపే ప్రశ్నకు ఆన్సర్ చేయాలి. పరీక్షల్లో అభ్యర్థులకు ఆయా విభాగాల్లో వచ్చిన మార్కుల ప్రకారం ఏ కోర్సులకు ఎన్నికవుతారనేది నిర్ణయించి తెలియజేస్తారు. పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు మాత్రమే కోచింగ్ ఇస్తారు. పరీక్ష ముగిసిన గంటలోపే ఫలితాలు వెల్లడిస్తారు.