Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ ఆవిష్కరించిన డీవైఎఫ్ఐ నాయకులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రయివేటు కోచింగ్ కేంద్రాల దోపిడీని అరికట్టాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) డిమాండ్ చేసింది. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న కోచింగ్ కేంద్రాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద డీవైఎఫ్ఐ నాయకులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు ఎ విజరుకుమార్, రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో అశోక్‌నగర్, నారాయణగూడ, అమీర్‌పేట, ఎస్ఆర్నగర్, దిల్షుక్నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఎల్బీనగర్, కోఠి, అబిడ్స్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో ప్రయివేటు కోచింగ్ కేంద్రాలు విచ్చలవిడిగా ఫీజులను వసూలు చేస్తున్నాయని విమర్శించారు. ఫీజుల వసూలుకు ఎలాంటి ప్రాతిపదిక లేదన్నారు. వాటిపై ప్రభుత్వ నియంత్రణ కొరవడిందని చెప్పారు. ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కోచింగ్ కేంద్రాలు అడ్డగోలుగా ఫీజులు గుంజుతున్నాయని విమర్శించారు. నిరుద్యోగులు ఉద్యోగాల ప్రకటనుల రాక ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వ ప్రకటనను ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నాయని అన్నారు. కనీస సదుపాయాల్లేకుండా ఫంక్షన్‌హాళ్లు, ఇతర ఇరుకు గదుల్లో కోచింగ్ ఇస్తున్నాయని విమర్శించారు. కోచింగ్ కేంద్రాలను ప్రభుత్వం నియంత్రించాలని డిమాండ్ చేశారు. వాటిలో కనీస సదుపాయాలు కల్పించాలని కోరారు. అనుమతిలేని కోచింగ్ కేంద్రాలను మూసేయాలన్నారు. ప్రభుత్వమే అందరికీ ఉచితంగా కోచింగ్ ఇచ్చే సదుపాయాన్ని కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నగర కన్వీనర్ జావిద్, నాయకులు రఘు, బల్పిర్, రాజు తదితరులు పాల్గొన్నారు.