Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయండి
- డీఈవోలకు మంత్రి సబిత ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వచ్చే నెల 23వ తేదీనుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యా శాఖాధికారుల(డీఈవో)ను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఐదు లక్షలకుపైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే అవకాశముందనీ, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. బుధవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయంలో జరిగిన డీఈవోల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లతోనే నిర్వహించబోతున్నామని వివరించారు. విద్యార్థుల సౌకర్యార్ధం 70 శాతం సిలబస్‌తో, పరీక్షా సమయాన్ని సైతం అరగంట పెంచామనీ, ప్రశ్నాపత్రంలో అధిక ఛాయిస్ కల్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలనీ, పరీక్షలు సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదుతోపాటు వారు తమ పాఠశాల విద్యను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు వసతులను కల్పించేందుకు 'మన ఊరు - మనబడి' కార్యక్రమాన్ని ప్రారంభించామని వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలల్లో మార్పు కనిపించాలని సూచించారు. మూడేండ్లలో అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని డీఈవోలను ఆమె ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఆంగ్ల మాధ్యమంలో బోధించేలా అవసరమైన శిక్షణను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తయ్యేలా చూడాలని కోరారు. నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సంబంధించి పరీక్షా కేంద్రాల ఎంపిక, నిర్వహణలోనూ ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా డీఈవోలు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.