Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు రోజులపాటు జాతీయ సదస్సు
- కోవిడ్ అనంతర వ్యూహాలు, ప్రాథమిక ఆరోగ్య సేవల బలోపేతంపై చర్చలు
- మీడియా సమావేశంలో నిర్వాహకులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఫ్యామిలీ మెడిసిన్, ప్రైమరీ కేర్‌పై ఐదవ జాతీయ సదస్సు గురువారం నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్‌లో జరగనున్నది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ఎన్.ఎస్.ఎస్‌లో జరిగిన మీడియా సమావేశంలో సదస్సు ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ వి.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ విక్రమ్ చేర్యాల, కో ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ ఫణివేణి, కోశాధికారి డాక్టర్ శిరీష, కల్చరల్ కమిటీ హెడ్ డాక్టర్ నళిని, సైంటిఫిక్ కమిటీ హెడ్ డాక్టర్ కిరణ్మయి తదితరులు మాట్లాడారు. కోవిడ్ మహమ్మారి కొత్త వ్యూహాలను రూపొందించుకోవాల్సిన అవసరాన్ని తెలిపిందన్నారు. ప్రాథమిక సేవలు, ప్రజారోగ్యం యుద్ధప్రాతిపదికన బలోపేతం చేయాల్సిన అవసరముందని తెలిపారు. సదస్సులో ప్రాథమిక ఆరోగ్య సేవలు,పథకాలు, పాండమిక్స్, ఎండమిక్స్ యూనివర్సల్ హెల్త కవరేజీ, ఆరోగ్య కార్యకర్తల సేవ, రక్షణ, ఫ్యామిలీ మెడిసిన్ ప్రోగ్రాములు, వృత్తిపరమైన శిక్షణ, ఎదుగుదల తదితర అంశాలపై వివిధ రూపాల్లో చర్చలు జరుగుతాయని వెల్లడించారు.
తొలి రోజు ఏప్రిల్ ఎనిమిదిన సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో పీజీ అప్ డేట్స్‌పై, అదే రోజు బీబీనగర్ ఎయిమ్స్‌లో ఫ్యామిలీ మెరుగైన విధానాలు అనే అంశంపై ప్యానెల్ డిస్కషన్స్ ఉంటాయని తెలిపారు. ఏప్రిల్ 9, 10 తేదీల్లో జూబ్లిహిల్స్‌లోని అపొలొ మెడికల్ కాలేజీలో సదస్సు ఉంటుందని చెప్పారు. ఏప్రిల్ 9న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావుతో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి సుజాతరావు, నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్ర డైరెక్టర్ వాకాటి కరుణ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, డాక్టర్ శాంతా సిన్హా, డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, అకాడమీ ఆఫ్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌పీఐ) జాతీయ అధ్యక్షులు డాక్టర్ రమణ్ కుమార్, డాక్టర్ సునీల్ అబ్రహాం, కల్నల్ మోహన్ కుబేంద్ర (సీఎంసీ, వెల్లూరు), డాక్టర్ శాంతారాం, డాక్టర్ బిపిన్ సేథీ, డాక్టర్ నరసరాజు, సూర్యారావు, డాక్టర్ వికాస్ భాటియా (ఎయిమ్స్, బీబీనగర్), డాక్టర్ దిలీప్ మతాయి (అపొలొ మెడికల్ కాలేజీ డీన్) తదితర పేరెన్నికగన్న ఫ్యామిలీ ఫిజిషియన్లు పాల్గొననున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఫ్యామిలీ ఫిజిషియన్లు కూడా ఇందులో భాగస్వాములు కానున్నట్టు చెప్పారు.
కరోనా మహమ్మారి అనేక మంది ప్రాణాలను తీసుకున్నదని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ సరిగా లేకపోవడంతో అంతా పట్టణాల్లోని పెద్దాస్పత్రుల వైపు పరుగులు తీశారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేవలం 1.7 శాతం మాత్రమే ప్రాథమిక ఆరోగ్యానికి కేటాయించిందని విమర్శించారు. దీనిని పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఫ్యామిలీ ఫిజిషియన్లు ఎక్కువగా మంది అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఫ్యామిలీ ఫిజిషియన్ పీజీ సీట్లను పెంచాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక ఆరోగ్యం బాగున్న దేశాలు మహమ్మారిని దీటుగా ఎదుర్కొన్నట్టు వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రాథమిక ఆరోగ్యానికి ఎక్కువ నిధులు కేటాయించాలన్నారు. క్యూబా దేశం, కేరళ రాష్ట్రం తదితర చోట్ల మహమ్మారిని మెరుగ్గా ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కేవలం ఎంబీబీఎస్ అర్హత కలిగిన వారితో సరిపెడితే పెద్దగా ప్రయోజనం ఉండదనీ, ఫ్యామిలీ ఫిజిషియన్లను అందుబాటులో ఉంచితే బాగుంటుందని సూచించారు. ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ నవజాత శిశువుల నుంచి వ ృద్ధుల వరకు పలురకాల వ్యాధులకు ప్రాథమిక వైద్యంలోనే చూడగల పరిజ్ఞానం ఫ్యామిలీ ఫిజిషియన్లకుంటుందని చెప్పారు. సదస్సులో హైదరాబాద్ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నట్టు తెలిపారు.