Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమిషనరేట్ ఎదుట ధర్నాలో జె.వెంకటేశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మీసేవా ఉద్యోగులకు జీవో నెంబర్ 60 ప్రకారం వెంటనే వేతనాలు పెంచాలని తెలంగాణ మీ-సేవా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు జె.వెంకటేశ్ డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని మీసేవా ప్రధాన కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. 'జీతాలు పెంచాలి...పర్మినెంట్ చేయాలి..కనీస వసతులు కల్పించాలి...' అంటూ నినదించారు. అనంతరం కమిషనర్ జిటి వెంకటేశ్వరరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ధర్నానుద్దేశించి జె.వెంకటేశ్ మాట్లాడుతూ..నాలుగేండ్లలో నిత్యావసర సరుకుల ధరలు, ఇంటికిరాయిలు, వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగాయన్నారు. ఇలాంటి సమయంలో అరకొర వేతనాలతో ఎలా బతకాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 11వ పీఆర్సీ ప్రకారం మీసేవా సెంటర్ మేనేజర్‌కు రూ.31,040, ఆపరేటర్‌కు రూ.22,900, అన్‌స్కిల్డ్ వర్కర్లకు రూ.19,500 వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మీసేవ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలనీ, అధికారుల వేధింపులను అరికట్టాలని విన్నవించారు. ప్రతి మీసేవ ఉద్యోగికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ చెల్లించాలనీ, ప్రతి కేంద్రం వద్ద సెక్యూరిటీ గార్డును నియమించాలని డిమాండ్ చేశారు. మీసేవ కేంద్రాల్లో కనీసం ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. కనీస వసతులు కల్పించకుండా ఉద్యోగులు ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. వెంటనే ఆ కేంద్రాల్లో ఫ్యాన్లు, వాష్‌రూమ్‌లను ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.సురేశ్, ప్రధాన కార్యదర్శి జెనీమా, సహాయకార్యదర్శి కవిత, ఉపాధ్యక్షులు బాలరాజు, లలిత, కోశాధికారి ఏవీబీ లక్ష్మి, మీసేవా సిబ్బంది పాల్గొన్నారు.