Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం
- నలుగురు సరఫరాదారులతోపాటు 11 మంది అరెస్ట్
- 960 గ్రాముల హాష్ ఆయిల్, ఐదు సెల్ఫోన్లు, ద్విచక్రవాహనం స్వాధీనం
- స్మగ్లింగే ఆ కుటుంబాల ప్రధాన ఆదాయం
- వివరాలు వెల్లడించిన నార్కోటిక్స్ డీసీపీ చక్రవర్తి
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ సిటీలో మరోసారి డ్రగ్స్ బయటపడింది. ఓయూ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎర్రకుంట రోడ్లో 120 గ్రాముల హాష్ ఆయిల్, నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిల్లో 840 గ్రాముల హాష్ ఆయిల్‌ను విక్రయిస్తున్న వారితోపాటు, వినియోగిస్తున్న వారిని అరెస్టు చేశారు. రెండు పోలీస్స్టేషన్ల పరిధిల్లో నలుగురు సప్లయర్లు, 11మంది వినియోగదారులను ఉస్మానియా యూనివర్శిటీ, నల్లకుంట పోలీసులతో కలిసి నార్కోటిక్స్ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం నల్లకుంట పోలీస్‌స్టేషన్‌లో మీడియా సమావేశంలో నార్కోటిక్స్ డీసీపీ చక్రవర్తి వివరాలు వెల్లడించారు.
విశాఖపట్నానికి చెందిన కె.నాగేశ్వర్రావు గంజాయి, హాష్ అయిల్ సరఫరా చేస్తున్నాడు. ఆయన నుంచి హైదరాబాద్ నగరానికి చెందిన వి.లక్ష్మీపతి తీసుకుని విద్యార్థులకు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు విక్రయిస్తున్నాడు.
విశాఖపట్నం, అరకులో నాగేశ్వర్రావు కిలో హాష్ ఆయిల్‌ను రూ.50వేలకు కొనుగోలు చేసేవాడు. దాన్ని విక్రయించేందుకు లక్ష్మిపతితోపాటు మరికొంత మంది ఏజెంట్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాడు. ఐదు గ్రాముల హాష్ ఆయిల్‌ను రూ.3000కు సరఫరా చేస్తున్నారు. గంజాయి, హాష్ ఆయిల్ సరఫరాలో నాగేశ్వర్రావుతోపాటు వారి కుటుంబసభ్యులు, బంధువులు ఉన్నారు. వీరు స్మగ్లింగే ప్రధాన ఆధాయంగా పనిచేస్తున్నారు. ఒడిశా, ఢిల్లీ, కేరళ, కర్ణాటక, ముంబాయి, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని సరఫరా చేస్తున్నారు. సమాచారం అందుకున్న నార్కోటిక్ ఎన్ఫోర్సుమెంట్ పోలీసులు నల్లకుంట పోలీసులతో కలిసి దాడులు చేశారు. ఇద్దరు నిందితులతోపాటు మియాపూర్‌కు చెందిన ఏ.వంశీకుమార్, సంగారెడ్డికి చెందిన విక్రం మోరియాను అరెస్టు చేశారు. రూ.5 లక్షల విలువగల 840గ్రాముల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మరో ఘటనలో నాచారానికి చెందిన ఎం.మదన్, చర్లపల్లికి చెందిన ఎన్.రాజుతోపాటు బోయిన్‌పల్లికి చెందిన యువకుడు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వైజాగ్‌కు చెందిన బుజ్జిబాబు అనే స్మగ్లర్‌తో పరిచయం చేసుకున్నారు. రూ.60వేలకు కిలో హాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఐదు గ్రాముల చొప్పున చిన్నచిన్న బాటిళ్లలో నింపి రూ.3000కు సరఫరా చేస్తున్నారు. సమాచారం అందుకున్న నార్కోటిక్ వింగ్, ఓయూ పోలీసులు దాడి చేసి ఇద్దరు నిందితులతోపాటు 9 మంది వినియోగదారులను అరెస్టు చేశారు. విచారణలో 18 మంది మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నట్టు గుర్తించామని డీసీపీ తెలిపారు. రెండు కేసుల్లో పరారీలో వున్నవారి కోసం గాలిస్తున్నామని తెలిపారు.