Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నాయకులు ఎం సుబ్బారావు
- ఎస్వీకే వద్ద పార్టీ పతాకావిష్కరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేరళలోని కన్నూర్‌లో ప్రారంభమైన సీపీఐ(ఎం) 23వ అఖిల భారత మహాసభల సందర్భంగా బుధవారం హైద రాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) వద్ద ఆ పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకులు రఘుపాల్ ఆవి ష్కరించారు. 'సీపీఐ(ఎం) జిందాబాద్, వర్ధిల్లాలి మార్క్సిజం, లెనినిజం'అంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. బుధవారం నుంచి ఈనెల పదో తేదీ వరకు ఈ మహాసభలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు ఎం సుబ్బారావు మాట్లాడుతూ కార్పొరేట్ల ప్రతినిధిగా బీజేపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రజలను అన్ని విధాలుగా దోపిడీ చేస్తున్నదని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజలు ధరల పెరుగుదలతో విలవిలాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులను, దేశ సంపదను, వనరులను గుత్తా పెట్టుబడిదారులకు అప్పగించడమే మోడీ ప్రభుత్వ లక్ష్యమని విమర్శించారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తామనీ, ప్రజల సమస్యలను పరిష్కరిస్తామనీ, ధరలు తగ్గిస్తామని 2014 ఎన్నికల్లో మోడీ హామీ ఇచ్చారని వివరించారు. ఎనిమిదేండ్లు అవుతున్నా అవేమీ చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి చైనా, ముస్లిం, పాకిస్తాన్‌ను శత్రువుగా చూపించి భావోద్వేగాలను పెంచుతున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీని ఓడిస్తే తప్ప దేశానికి భవిష్యత్తు లేదనీ, ప్రజా సమస్యలకు పరిష్కారం లేదని వివరించారు. బీజేపీ ఓటమికి అనుసరించాల్సిన వ్యూహం, ఎన్నికల్లో ఎత్తుగడలు, ప్రజా సమస్యలపై ఉద్యమాల గురించి చర్చించేందుకే కన్నూర్‌లో మహాసభలు జరుగుతున్నాయని చెప్పారు. ఆ మహాసభ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ, ప్రజా ఉద్యమాలను నిర్మించాలి అన్నారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు జి బుచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.