Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలని..
- జాతీయ రహదారి దిగ్బందం.. నిలిచిన వాహనాలు
- పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ- విలేకరులు
రైతులు యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధం చేశారు. దాంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దాంతో పోలీసులు రాస్తారోకోలను అడ్డుకున్నారు. తెలంగాణలో రైతాంగం ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందని, రైతుల కోసం ఎంతకైనా పోరాడుతామని మంత్రులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జాతీయ రహదారి కిసాన్గూడ చౌరస్తా వద్ద జడ్పీ చైర్పర్సన్ అనితా హరినాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రత్నం, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు రాస్తారోకో కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని జాతీయ రహదారిని సుమారు గంటన్నర పాటు రాస్తారోకో నిర్వహించి దిగ్బంధించారు. దాంతో వాహనాలు ఎక్కడికక్కడ భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా కడ్తాల్ జాతీయ రహదారిపై చేపట్టిన నిరసనలో రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొనగా, ఆదిలాబాద్ జిల్లా జందాపూర్ జాతీయ రహదారిపై చేపట్టిన నిరసనలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంజాబ్ తరహాలో రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కూడా కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పండించిన వడ్లను కొనుగోలు చేయిస్తామని చెప్పిన రాష్ట్ర బీజేపీ నాయకులు పంట చేతికి రాగానే ముఖం చాటేశారని విమర్శించారు. కేంద్రం కొనుగోలు చేసే వరకు రాష్ట్ర రైతుల పక్షాన ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఆదిలాబాద్ జడ్పీ చైర్మెన్ రాథోడ్ జనార్ధన్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపురావు పాల్గొన్నారు.
గద్వాల జిల్లా ఎర్రవల్లి వద్ద హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిపై మాజీ ఎంపీ మంద జగన్నాధం, అలంపూర్ నియోజకవర్గ పార్టీ మాజీ ఇంచార్జి మంద శ్రీనాధ్, నాయకులు వడ్డేపల్లి శ్రీనివాసులు, నాయకులు అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. రహదారి పొడవునా భారీ ఎత్తున వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పోలీసులు రాస్తారోకోను విరమింపజేసే యత్నం చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ముంబయి జాతీయ రహదారిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన దిగ్బంధించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మెన్ భూపాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కందిలో జిల్లా అధ్యక్షులు చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాణిక్ రావు, పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. అదే విధంగా జహీరాబాద్, న్యాల్కల్, నారాయణఖేడ్, కల్హేర్ మండలాల్లో నిరసన చేపట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని విజయవాడ-జగదల్పూర్ జాతీయ రహదారిని టీఆర్ఎస్ నాయకులు దిగ్బంధనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్యెల్యే వనమా మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలని, లేనియెడల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నార్కట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారి ఏడుకోట్లతండా వద్ద గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మున్సిపల్ చైర్మెన్ తిరునగర్ భార్గవ్ పాల్గొన్నారు. దామరచర్ల మండలకేందంలో నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పెద్దవూర మండలకేంద్రంలో రైతులతో కలిసి ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ రాస్తారోకోలో పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయరహదారి తెలంగాణ ముఖద్వారం రామాపురం ఎక్స్‌రోడ్డు వద్ద ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడిసైదిరెడ్డి.. రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ జాతీయ రహదారి 65పై రెండున్నర గంటలపాటు రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామం వద్ద గల సాలూర-బొంబాయి అంతరాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ రవీందర్ నాయక్, ఎస్ఐ సందీప్ పోలీసు సిబ్బందితో ధర్నా స్థలానికి చేరుకుని పలువురు నాయకులను బలవంతంగా వాహనాల్లో తరలించి అరెస్టు చేశారు. నాయకుల అరెస్టును అడ్డుకోబోయిన కార్యకర్తలనూ అరెస్టు చేశారు.